అసమ్మతిపై టీఆర్‌ఎస్‌ కన్నెర్ర

4 Oct, 2018 05:05 IST|Sakshi

కఠిన చర్యలకు పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం

మునుగోడు రెబెల్‌ వేనేపల్లిపై వేటు

నల్లగొండ సభ ముందు తీవ్ర నిర్ణయం

జాబితాలో మరో ఐదారుగురు నేతలు

బహిరంగ సభలకు అసమ్మతి దెబ్బ

వరంగల్, ఖమ్మం సభలు వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: అసమ్మతి రాగం వినిపిస్తున్న పార్టీ నేతలపై టీఆర్‌ఎస్‌ కన్నెర్రజేస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా, పోటీగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండలో గురువారం బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ జిల్లాలోని మునుగోడు అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. వెంకటేశ్వరరావును టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు.

పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా వేనేపల్లి వెంకటేశ్వరరావును బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరరావుపై బహిష్కరణ నిర్ణయం టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌కు కొన్ని సెగ్మెంట్లలో అసమ్మతి నేతల తీరు ఇబ్బందిగా మారింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తరఫున మంత్రి కేటీఆర్‌ అసమ్మతి నేతలతో భేటీ అవుతున్నారు.

అయితే పార్టీ అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేస్తున్న కొందరు నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు. దీంతో వీరిపై కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. నల్లగొండలో సభ నేపథ్యంలోనే మునుగోడు అసమ్మతి నేత వెంకటేశ్వరరావును బహిష్కరించారు. మరికొందరు నేతల విషయంలోనూ టీఆర్‌ఎస్‌ ఇదే రకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. చివరి అవకాశంగా ఓసారి చర్చలకు ఆహ్వానించాలని, అయినా దారికి రాకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.  

అభ్యర్థులకు అడ్డంకులు..
కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనను పొగుడుతూ.. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలు, గులాబీ రంగు జెండాలు వినియోగిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నామినేషన్ల సమయం వరకు తమకే టికెట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలతో కంటే వీరితోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి.

కేడర్‌లోనూ అయోమయం నెలకొంటోంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత రాక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇలా సొంత పార్టీ నేతలతో ఇబ్బంది పడే అభ్యర్థులు కేటీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేటీఆర్‌ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు 10 నియోజకవర్గాల నేతలు చర్చలకు సైతం రావడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

వీరి విషయంలోనూ పార్టీ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న కోరుకంటి చందర్‌ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), రాజారపు ప్రతాప్‌ (స్టేషన్‌ఘన్‌పూర్‌), చకిలం అనిల్‌కుమార్‌ (నల్లగొండ) విషయంలోనూ టీఆర్‌ఎస్‌ రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వేములవాడ, రామగుండం, జగిత్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, సత్తుపల్లి, మక్తల్, మునుగోడు నియోజకవర్గాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నేతలపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

రెండు సభలు వాయిదా..
ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్‌ఎస్‌.. ప్రచారంలో మాత్రం ఆ ఊపు కొనసాగించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేందుకు సమయం ఉండటంతో ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

అక్టోబర్‌ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్, 7న వరంగల్, 8న ఖమ్మంల్లో సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్న అసంతృప్తుల దృష్ట్యా వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలను వాయిదా వేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది. బహిరంగ సభ నిర్వహించే వరంగల్‌ నగరంలోని వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు.

దీంతో ఇక్కడ సభ వాయిదా వేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పూర్తిగా తొలిగిపోలేదు. దీంతో ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభనూ వాయిదా వేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలసి బహిరంగ సభ విషయాన్ని ప్రస్తావించగా.. వరంగల్‌ బహిరంగ సభ ఉందని ఎవరు చెప్పారని కేటీఆర్‌ వారిని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ రెండు బహిరంగ సభల నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.

ఆదిలాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహించినందున ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సభ ఉండకపోవచ్చని తెలిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహించిన కారణంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లోనూ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల అనంతరం సీఎం కేసీఆర్‌ నేరుగా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమం మొదలుకానుంది.

మరిన్ని వార్తలు