నాయకుల వ్యవహార శైలి, భాష అభ్యంతరకరంగా ఉన్నాయి

20 May, 2019 10:36 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 1999 నుంచి వస్తోన్న ఎగ్జిట్‌ పోల్స్‌లో చాలా వరకూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయన్నారు. శాంతి విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయుడైన ఆయనకు ఆదివారం గుంటూరులోని క్లబ్‌లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 42 ఏళ్ల తర్వాత తొలిసారి తాను లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ఎగ్జిట్‌ పోల్స్‌ హడావుడి సహజమే అన్నారు. అయితే వీటికి ఎలాంటి బేస్‌ ఉండదని.. ఎగ్జాట్‌ పోల్స్‌ కోసం చూడాలని వెంకయ్య హితవు పలికారు.

మే 23 న అసలైన ఫలితాలు వచ్చేవరకు గెలుపు పట్ల అన్ని పార్టీలు నమ్మకంగానే ఉంటాయన్నారు వెంకయ్య నాయుడు.  కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అన్నింటికన్నా ప్రధానమన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంటే.. ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాక నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన సూచించారు.

క్యారెక్టర్‌.. క్యాండిడేట్‌.. క్యాలిబర్‌.. కెపాసిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేయాలి. కానీ ప్రస్తుత రాజకీయల్లో క్యాష్‌, క్యాస్ట్‌ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని వెంకయ్యా నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు పెడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవహేళన చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు