మీకెందుకు ఓటెయ్యాలి ?

5 May, 2018 09:02 IST|Sakshi

హామీలు నేరవేర్చని నేతలు గోబ్యాక్‌ అంటూ ప్రజల నినాదాలు

ఎన్నికల ప్రచారంలో నేతలకు  చేదు అనుభవం

బనశంకరి:   గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని మంత్రులు, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు నిలదీస్తుండగా మరికొన్ని చోట్ల ధర్నాలకు దిగుతుండటంతో దిక్కుతోచని అభ్యర్థులు అక్కడ నుంచి మెల్లగా జారుకునే పరిస్ధితి ఎన్నికల ప్రచారంలో ఎదురౌతుంది. అంతేగాక కొన్ని చోట్ల గోబ్యాక్‌ అంటూ బోర్డులు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తూ తమ అక్రోశం వెళ్లబోస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలో...
ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత జిల్లా మైసూరులో రాష్ట్రమంత్రులైన హెచ్‌సీ.మహదేవప్ప, తన్వీర్‌సేఠ్‌‡, హెచ్‌.ఆంజనేయలను  ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లు నిలదీస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. టీ.నరసీపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా హెచ్‌సీ.మహదేవప్ప విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం టీ.నరసీపుర నియోజకవర్గ పరిధిలోని తలకాడు, వాటాళ్‌ గ్రామాలకు వెళ్లగా అక్కడ గ్రామస్తులు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మీకు మేము ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. గత ఐదేళ్లులో తమ గ్రామం ముఖం చూడని ఓట్ల కోసం వచ్చారా అని మండిపడ్డారు.

అలాగే నరసింహరాజనియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్‌ను ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో రోడ్డు అభివృద్ధి విషయంలో ఓ యువకుడు మంత్రి ముందే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ముందే మంత్రి ఎదుట విరుచుకుపడిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే మంత్రి హెచ్‌.అంజనేయను కెరెయాగళహళ్లిలో జేడీఎస్‌ కార్యకర్తలు తమ గ్రామానికి సిమెంటు రోడ్డు వేయలేదని నల్లజెండాలు ప్రదర్శించారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాష్ట్రమంత్రి టీబీ.జయచంద్రను గురువారం కంబారహళ్లి, అగ్రహార గ్రామానికి చెందిన ప్రజలు నీటి సమస్య పరిష్కలేదని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రామనగర జిల్లా చెన్నపట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన యోగేశ్వర్‌ను గురువారం సామందిపుర గ్రామానికి ప్రచారానికి వెళ్లిన సమయంలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని దిగ్బందించారు. ఈ సమయంలో గ్రామస్తులకు  బీజేపీ అభ్యర్థి యోగేశ్వర్‌ మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా అక్కడనుంచి వెనుదిరిగారు. ఇస్లాంపుర గ్రామస్తులు తమ గ్రామంలోకి ఎమ్మెల్యే రాకూడని పెట్టిన బోర్డులను ఎన్నికల అధికారులు తొలగించారు.

మైసూరు జిల్లా కృష్ణరాజ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఎస్‌ఏ.రామదాస్‌ను జేపీ.నగర వాసులు ఎన్నికల ప్రచార సమయంలో ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు తిరిగి చూడలేదంటూ గొడవకు దిగారు.
దక్షిణకన్నడ జిల్లా సుళ్యలో చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ బీఎస్‌.శ్రీకృష్ణ తన ఇంటి ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్ధులకు ప్రత్యేక బోర్డు పెట్టాడు. బోర్డులో రాసిని విషయాలకు కట్టుబడి ఉంటూ మాత్రమే ఓట్లు అభ్యర్దించడానికి రావాలని షరతు విధించాడు. గోహత్యనిషేధం, అవినీతినిర్మూలన, మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయడం, మహిళలు. ఆడపిల్లల భద్రతకు ప్రాదాన్యత తదితర 10 అంశాలతో ఇంటి ముందు బోర్డు పెట్టాడు. కన్మాన గ్రామంలో ఇంటి గోడలపై కాంగ్రెస్‌ నేతలకు ఇంట్లోకి ప్రవేశం లేదు అని బోర్డులు పెట్టడంతో ఎన్నికల అధికారులు తొలగించారు. అంతేగాక సుళ్యలో పలు బార్లలో ఎలాంటి రాజకీయపార్టీల గురించి చర్చించరాదని బోర్డులు పెట్టారు.
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం పరిధిలోని ఏకలవ్యనగరలో బుధవారం సీఎం.సిద్దరామయ్యకు మద్దతు నటి ఎమ్మెల్సీ జయమాల, ముఖ్యమంత్రి చంద్రు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈసమయంలో వీరిని కార్మికనేత ఒకరు విరుచుకుపడ్డాడు. పాల్కన్‌టైర్స్‌ పరిశ్రమలో కార్మికుల సమస్య పరిష్కరించని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరిశ్రమ ప్రారంభించకుండా కంపెనీ యజమానికి మద్దతుపలుకుతూ కార్మికులను వీధిపాలు చేశారని. దీంతో మీకు ఓటు వేసేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడికి ఏమీ చెప్పాలో అర్థం కాక నటి జయమాల, ముఖ్యమంత్రి చంద్రు అక్కడనుంచి జారుకున్నారు.

మరిన్ని వార్తలు