అధికార దుర్వినియోగం కాకుండా చూడండి

7 Sep, 2018 02:44 IST|Sakshi

గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ నేతల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ప్రభుత్వం పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తీసుకునే హడావుడి నిర్ణయాలపై సమీక్షించాలని కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు గురువారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు.

అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో ప్రజల హక్కులను, ప్రతిపక్ష పార్టీల స్వేచ్ఛను కాపాడాలని కోరామన్నారు. ఓటరు జాబితా సవరణలో 2019 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఈ ముందస్తు వల్ల ఓటు హక్కు పొందలేని పరిస్థితి నెలకొందని, ఆ విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ప్రభుత్వానికి 9 నెలల గడువున్నా రద్దు చేసి, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలనుకుంటున్నారని, ఈ విషయంలో తమకున్న అనుమానాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారులు టీఆర్‌ఎస్‌ తొత్తులుగా వ్యవహరించారని, ఇప్పుడలా జరగకుండా చూడాలని కోరామన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పనులను చేయించుకునే అవకాశం ఉందని.. అలా జరగకుండా చూడాలని గవర్నర్‌కు విన్నవించామని ఎంపీ దత్తాత్రేయ చెప్పారు.

మరిన్ని వార్తలు