నీటి తీరువా రద్దు

10 May, 2018 01:03 IST|Sakshi
మెదక్‌ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

800 కోట్ల బకాయిలూ మాఫీ

మెదక్‌ సభలో కేసీఆర్‌ ప్రకటన

రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ వేయం

సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే నిర్వహిస్తుంది

రైతు బంధు.. ప్రపంచంలోనే ఉత్తమ పథకం

సాక్షి, మెదక్‌ : రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన రూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలను మాఫీ చేయడంతోపాటు నీటి తీరువా వసూళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వమే సాగునీటి ప్రాజెక్టులు నిర్వహిస్తుందని, రైతులపై ఎలాంటి ఆర్థిక భారమూ మోపబోమని స్పష్టం చేశారు. సీఎం బుధవారం మెదక్‌ జిల్లాలో పర్యటించారు. మెదక్‌ నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మెదక్‌ చర్చి గ్రౌండ్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రూ.20 కోట్ల మేరకు నీటి తీరువా బకాయిలున్నాయని, రైతుల సంక్షేమం కోసం వాటిని రద్దు చేయాలని పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి కోరారని సీఎం చెప్పారు. రైతు సంక్షేమం కోసం వారు కోరినట్టుగా నీటి తీరువా బకాయిలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశానికే ఆదర్శప్రాయ రీతిలో ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందజేస్తామని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్, బీజేపీ అట్టర్‌ ఫ్లాప్‌ 
రాష్ట్ర రాజకీయాల గురించి తనకు రంది లేదని సీఎం అన్నారు. ‘‘అడ్డగోలు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని చూస్తే నాకు ఎలాంటి బెరుకూ లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 85 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు’’అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

మెదక్‌ బిడ్డ అయిన తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ తిరోగమనంలో నడిపించాయని విమర్శించారు. రెండు పార్టీలూ అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యాయని విమర్శించారు. ‘‘దేశవ్యాప్తంగా రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీ, నిరుద్యోగ యువకుల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా దేశ రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తాం. ప్రజలు ఆశీర్వదించాలి’’అని కోరారు. 

రైతుబంధు... ప్రపచంలోనే ఉత్తమం 
రైతుబంధు పథకం ప్రపంచానికే ఆదర్శప్రాయమైనదని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. ‘‘ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. దేశమంతా ముక్కున వేలేసుకుని తెలంగాణ వైపు చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూ ప్రక్షాళన వంద శాతం విజయవంతమైంది. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో దీన్ని 9 ఏళ్ల క్రితం మొదలు పెడితే ఇంకా పూర్తి కాలేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా తాము ఇంకా భూ ప్రక్షాళన చేయలేదని ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నాతో అన్నారు.

కేవలం తెలంగాణలో మాత్రమే భూ ప్రక్షాళన సాధ్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’’అని కొనియాడారు. జూన్‌ 2 నుంచి అమలులోకి రానున్న నూతన రిజిష్ట్రేషన్‌ విధానంలో కూడా దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందని సీఎం ధీమా వెలిబుచ్చారు. పోలీసు శాఖ అద్బుతంగా పని చేస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లాలో పోలీసు శాఖకు అవసరమైన భవనాలు నిర్మించటంతోపాటు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. 

మెదక్‌ను కాంగ్రెస్‌ పట్టించుకోలేదు: హరీశ్‌ 
కాంగ్రెస్‌ హయాంలో మెదక్‌ జిల్లా అభివృద్ధి చెందలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రధానులు, మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధిని పట్టించుకోలేదని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ది వల్లే జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు దేవీప్రసాద్, శేరి సుభాష్‌ రెడ్డి, భూమిరెడ్డి, దామోదర్, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు