కర్ణాటకలో రాహుల్‌ వ్యూహం ఏంటి?

20 Mar, 2018 19:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : రాజకీయంగా దిగాలుపడి మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నాల్లో భాగంగా 1978 లో చిక్‌మగుళూరు నుండి లోక్‌సభకు పోటీచేస్తూ ఇందిరాగాంధీ తుంగనది ఒడ్డున ఉన్న శృంగేరి మఠంలో అడుగుపెట్టారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్‌ ఆర్స్‌ ఇందిరాగాంధీకి పూర్తి అండగా నిలబడి తన నాయకురాలి రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు వేసారు. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ మనవడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శృంగేరి మఠంలో బుధవారం అడుగు పెట్టనున్నారు. దాదాపు అదే పరిస్థితుల్లో...

వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.  ఉత్తరప్రదేశ్, బిహార్‌ ఉపెన్నికల్లో దెబ్బతిన్న బీజీపీకి కర్ణాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్‌ గాంధీకి తక్షణ కర్తవ్యం.

ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు.

గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై  విమర్శలు దాడి మొదలు పెట్టేసారు.   ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘10 శాతం ప్రభుత్వం’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు ... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపినాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే.

ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బిహార్‌ ఎన్నికల్లో బీజీపీ చావు దెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్నఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. యోగీ ముందు ఉత్తరప్రదేశ్‌ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు.

బీజేపీ  (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి.  2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  దేవెగౌడ పార్టీ మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి.

ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్‌ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జీజిఎస్‌ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది.  కాంగ్రెస్‌ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జేడీఎస్‌ 15 స్థానాలకే పరిమితమైంది.  అయితే అప్పటి మోదీ హవా వేరు.  గత సంవత్సర కాలంలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు తొమ్మిదిలో పాగా వేసాయి.  పంజాబ్‌ మినహా..  దేశంలో 21 రాష్ట్రాల్లో  కాషాయం జెండా రెపరెపలాడుతోంది.  224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఈ నిర్ణయం ఎంతవరకు కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.

 ఎస్‌ . గోపీనాథ్‌రెడ్డి

>
మరిన్ని వార్తలు