కేజ్రివాల్‌ చేస్తే తప్పు, రియో చేస్తే ఒప్పా?

26 Mar, 2018 15:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. 20 మంది శాసన సభ్యులను సలహాదారులుగా (అడ్వైజర్స్‌) నియమించి వారికి ఒకటి, రెండు ప్రభుత్వ విభాగాల సంపూర్ణ బాధ్యతలను అప్పగించారు. ఆ మరుసటి రోజే మరో ఆరుగురు శాసన సభ్యులను ప్రభుత్వరంగ సంస్థలకు, బాంబూ మిషన్‌ లాంటి మిషన్లకు చైర్మన్లను నియమించారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని చెల్లవని రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రభుత్వం 21 మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ 2017, జూలై నెలలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే.

తాను పార్లమెంటరీ కార్యదర్శులను నియమించలేదని, అడైజర్లను మాత్రమే నియమించానని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వాదిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. రాజ్యాంగం నిబంధనల ప్రకారం 12 మందికి మించి రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోరాదు. అసమ్మతి తలెత్తకుండా అందరిని సంతప్తిపరచడంలో భాగంగా రియో ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీలో కేజ్రివాల్‌ ఇలాంటి నిర్ణయమే తీసుకొని బోల్తాపడ్డారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని సుప్రీం కోర్జు కొట్టివేయగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందున 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం చెల్లదని ఎన్నికల కమిషన్‌ దెబ్బ కొట్టింది. అంతటి చర్య తగతంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో వారి సభ్యత్వం మిగిలింది.

పార్లమెంటరీ కార్యదర్శులు లేదా అడ్వైజర్లు పేర్లు వేరైన నియామకాలు ఒకే రకానికి చెందినవని, గతంలో వారికి ప్రత్యేక ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చినట్లే ఇప్పుడు వీరికి ప్రత్యేక బాధ్యతలు ఇస్తున్నారని ‘నాగాలాండ్‌ వాలంటరీ కన్జూమర్స్‌ అసొసియేషన్‌’ అధ్యక్షుడు కిజోఖోటో సావి విమర్శించారు. ఈ నియామకాలు రాజ్యాంగంలోని 164 (1ఏ) అధికరణంతో పాటు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహా మంత్రుల సంఖ్య మొత్తం అసెంబ్లీ సీట్లలో 15 శాతానికి మించరాదని స్పష్టం చేస్తున్న 2003లో రాజ్యాంగంలో తీసుకొచ్చిన 91వ సవరణను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు.

ఇంతకుముందు నాగాలాండ్‌ సీఎం టీఆర్‌ తెలియాంగ్‌ 2017లో పార్లమెంటరీ కార్యదర్శులను నియమించగా ఆ నియామకాలు చెల్లవంటూ సావియే రాష్ట్ర గవర్నర్‌ వద్ద సవాల్‌ చేశారు. ఆయన నుంచి తీర్పు వెలువడక ముందే అసెంబ్లీ కాలపరిమితి తీరిపోయి ఎన్నికలు జరిగాయి. ఈశాన్య ఇలాంటి నియామకాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆప్‌ నియమాకాలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.

ఈ నియామకాలు కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంది. అడ్వజర్లుగా నియమితులైన వారికి బంగ్లా, కారు లాంటి అదనపు సౌకర్యాలు ఇస్తారా, లేదా అన్న విషయం తేలాక మాట్లాడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ కొత్త నియామకాలకు కేబినెట్‌ ర్యాంక్‌ హోదా కల్పిస్తారా లేదా అన్న విషయం తనకు తెలియదని, అందుకని తానిప్పుడు ఏమీ మాట్లాడలేనని బాంబూస్‌ బోర్డు చైర్మన్‌గా నియమితులైన నాగాలాండ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలి లవుంగు వ్యాఖ్యానించారు. అరవింద్‌ కేజ్రివాల్‌ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడంపై పెద్ద ఎత్తున బీజేపీ గొడవ చేయడంతోపాటు నానా రాద్ధాంతం చేసిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు