పురుషుల నుంచి అధికారాన్ని లాక్కోవాలి..

7 Dec, 2019 10:07 IST|Sakshi

సాక్షి, లక్నో : సమాజంలో పెరుగుతున్న నేరాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మహిళలు జనాభా దామాషా ప్రకారం పురుషుల నుంచి అధికారాన్ని లాక్కోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు. లక్నోలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మహిళలు అధికారంలోకి రావాలని నా అభిప్రాయం. హింసకు వ్యతిరేకంగా పంచాయితీ, శాసన సభలకు పోటీ చేసి రాజకీయాల్లోకి రండి. తద్వారా మీకు అధికారం లభిస్తుంది. దాంతో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టవచ్చ’ని పేర్కొన్నారు. మహిళల హక్కులు, భద్రత కోసం కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థాయిలలో పోరాడుతుందని వ్యాఖ్యానించారు. అంతకు ముందు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు.

రాష్ట్రంలో గత 11 నెలల్లో దాదాపు 90 అత్యాచార కేసులు నమోదయ్యాయని, మహిళలపై జరుగుతున్న నేరాల కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. ఉదాహరణగా ఉన్నావ్‌ ఘటనను ప్రస్తావించారు. ఈ కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యేను రక్షించడానికి ప్రభుత్వం చివరి వరకు ప్రయత్నించిందని ఆరోపించారు. చివరికి కోర్టు ఆదేశాలతో నాలుగు నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా బాధితురాలు చేస్తున్న పోరాటం ఒక యుద్ధంతో సమానమని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేను కాపాడి నిందితుల పక్షాన ఉంటుందా? లేక బాధితురాలి పక్షాన ఉంటుందా? అనేది తేల్చుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టడానికి తీసుకోదగిన చర్యలను వివరించారు. ఇది రాజకీయ సమస్య కాదని, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల భద్రతకు సంబంధించిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ‘శాంతి భద్రతలు కాపాడడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ఎప్పుడైనా చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అయితే ఎన్‌కౌంటర్‌ ఘటన గురించి తనకు పూర్తి వివరాలు తెలియవు. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడడం మంచిది కాద’ని వివరించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా