నేడు యడ్యూరప్ప ప్రమాణం

17 May, 2018 03:16 IST|Sakshi
యడ్యూరప్పకు శుభాకాంక్షలు తెలుపుతున్న శెట్టర్, నడ్డా, అనంత్‌కుమార్, జవదేకర్‌

ఉదయం 9గంటలకు రాజ్‌భవన్‌లో రెండ్రోజుల ఉత్కంఠకుతెరదించిన గవర్నర్‌

గవర్నర్‌ చర్యకు నిరసనగా సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌

బీజేపీ మా ఎమ్మెల్యేలకు100 కోట్లు, మంత్రి పదవిఆఫర్‌ ఇచ్చింది: కుమారస్వామి

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్‌ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌ తీవ్రంగా ఖండించాయి. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్‌ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్‌ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి.

యడ్డీ ఒక్కరే!
కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతల వ్యతిరేకతలు, హెచ్చరికల మధ్య బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. దీంతో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. యడ్డీ ప్రమాణానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆందోళనలు చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో రాజ్‌భవన్‌ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోనూ భద్రతను పటిష్టం చేయాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు తెలిసింది.  

ఉదయం నుంచీ హైడ్రామా!
హంగ్‌ తీర్పుతో రాజుకున్న కన్నడ రాజకీయాల్లో బుధవారం కూడా సస్పెన్స్‌ కొనసాగింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారు? గవర్నర్‌ ఎవరిని ఆహ్వానిస్తారనేదానిపై స్పష్టత రాకపోవడం. బలాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి, బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అయితే, సోమవారం గవర్నర్‌కు సమర్పించిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖలో ముగ్గురు ఎమ్మెల్యేల సంతకాల్లేకపోవటం మధ్యాహ్నం కలకలం రేపింది. వీరంతా బీజేపీతోనే ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కాంగ్రెస్‌లోని లింగాయత్‌ ఎమ్మెల్యేలు, జేడీఎస్‌ కూటమిలోని ఆరుగురు తమతోనే ఉన్నారని లీకులు ఇవ్వడంతో ప్రత్యర్థి కూటమిలో ఆందోళన నెలకొంది.

జేడీఎస్‌తో జవదేకర్‌ చర్చలు!
బీజేపీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమై యడ్యూరప్పను తమపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం ఉదయం జేడీఎస్‌ అధినేత కుమారస్వామితో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇవి విఫలం కావడంతో జేడీఎస్‌లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళన పెరిగింది. కాగా, రాణీ బెన్నూరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత ఈశ్వరప్పపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేరా?’ అని మండిపడ్డారు. అయితే, శంకర్‌ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. అటు, పలువురు కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో లేకుండా పోయారన్న వార్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ ఖండించారు. వారు ఎక్కడున్నా తమకే మద్దతు తెలుపుతారన్నారు.

బీజేపీ ప్రలోభాలు: కుమారస్వామి
తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. ‘ఆపరేషన్‌ కమల్‌’ను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం కానీయబోమన్నారు. బుధవారం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్‌లో జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కుమారస్వామిని తమ పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేస్తోంది. మేం తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా సమావేశానికి ఇద్దరు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిద్దరూ ఫోన్‌లోనూ అందుబాటులో లేరని తెలుస్తోంది. కాగా, తను బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వదంతులను దేవేగౌడ రెండో కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ తోసిపుచ్చారు. కుమారస్వామిని జేడీఎస్‌ పక్ష నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. కుమారస్వామి ఆరోపణలను జవదేకర్‌ ఖండించారు. అంతపెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదన్నారు. మోదీ ప్రోద్బలంతోనే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని సిద్దరామయ్య అన్నారు.

శెట్టర్‌ గెలుపును నిర్ధారించిన ఈసీ
సాక్షి, బళ్లారి: హుబ్లీ–ధార్వాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మంగళవారం ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్ల మధ్య స్వల్ప తేడా వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్‌ నలవాడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఫలితాన్ని నిలిపివేశారు. సమగ్ర పరిశీలన అనంతరం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శెట్టర్‌ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ బలం 104కు చేరుకుంది.  

రాజ్‌భవన్‌కు క్యూ కట్టిన పార్టీలు
.బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌ ముందు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. యడ్యూరప్ప, ఇతర బీజేపీ సీనియర్‌ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు తమకే అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు, 2008 తరహాలోనే ఈసారి కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ చాలా జాగ్రత్తపడింది. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అనంతరం జేడీఎస్‌–కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకున్న ఈ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకుందని ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే ఇరు పక్షాలకూ గవర్నర్‌ ఒకే సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు