‘అధికారులు స్పందించకపోవడానికి కారణం బాబే’

19 Oct, 2018 12:10 IST|Sakshi

తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తోన్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. తుపాను ఘటనను చంద్రబాబు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రసాద మాధ్యమాల యావలో పడ్డారని, నిరసన తెలుపుతున్న బాధితులను తాట తీస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడిని దుయ్యబట్టారు. నిరసన తెలుపుతున్న బాధితుల ఫోటోలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుబారా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నేను నిద్రపోను..వాళ్లను నిద్రపోనివ్వను

నేను నిద్ర పోను అధికారులను నిద్రపోనివ్వను అంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ప్రచార పిచ్చిలో ఉన్న చంద్రబాబు, బాధితులను పట్టించుకోవడం మర్చిపోయారని వెల్లడించారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. నిరసన తెలుపుతున్న వారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించారని వివరించారు. అధికార జులుంతో చంద్రబాబు బరితెగి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తిత్లి తుపాను సంభవించిన వెంటనే బాధితులను ఆదుకోవడానికి రెండు బృందాలను పంపారని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నిరసన తెలపడానికి వెళ్తుంటే ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుకున్న ఘటనను గుర్తు చేశారు.

నాలుగున్నరేళ్లు..నాలుగు లక్షల కోట్లు

నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని భూమన ఆరోపించారు. చంద్రబాబు తన చేతగాని తనాన్ని వైఎస్‌ జగన్‌ మీద నెట్టడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా కరువులు, తుపాన్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కరువుతో సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లా అల్లాడుతోంది..కానీ చంద్రబాబు పట్టించుకున్నపాపాన పోలేదని
మండిపడ్డారు. తాను స్వయంగా ఉద్దానంలో ప్రాంతంలో పర్యటించానని, ఆ ప్రాంతమంతా మరణ మృదంగం మోగుతోందని చెప్పారు. కన్నబిడ్డల్లాంటి కొబ్బరి, జీడి చెట్లు కూలిపోతే చంద్రబాబు ముష్టి వేసినట్లు
చాలీచాలనంత నష్టపరిహారం ప్రకటించారని భూమన ధ్వజమెత్తారు.

తుపాను బాధితులను ఆదుకోవడంలో బీజేపీ విఫలం

తుపాను బాధితులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. బీజేపీ తీరును వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ
దివాకర్‌ రెడ్డికి చెందిన బస్సు 10 మందిని పొట్టన పెట్టుకున్నా ఇంతవరకూ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని తెలిపారు. 10 రోజుల్లో వైఎస్‌ జగన్‌ తుపాను బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. 

సునీతవి తప్పుడు అభియోగాలు

మంత్రి పరిటాల సునీత వైఎస్‌ జగన్‌ మీద తప్పుడు అభియోగాలు మోపారని భూమన వ్యాఖ్యానించారు. 2003 ఏప్రిల్‌లో సునీత భర్త పరిటాల రవీంద్ర తనకు ఏమన్నా జరిగితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడే
కారణమని చెప్పిన విషయం గుర్తుకు లేదా అని సునీతని ప్రశ్నించారు. ఈ విషయం సునీతకు తెలియదా లేక మరిచిపోయారా అని అడిగారు.

మరిన్ని వార్తలు