‘విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం’

8 Nov, 2018 12:14 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయని, అయినా తాను భయపడనని అన్నారు. వాటిని తామేం పట్టించుకోవడంలేదని, రెవెన్యూలో పనిచేసిన వారందరికీ తెలుసునని, రెవిన్యూ మంత్రి ఈ వ్యవహరాలు చూడరని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు. ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు. బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల తరపున నిలదీస్తున్నానని, వైఎస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వాటికి నేను భయపడను. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంద’ని వ్యాఖ్యానించారు.

‘నిభందనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దంటే నీవు(చంద్రబాబు) సీఆర్‌డీఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్దతే అనుసరించారు. అనుభవం తెచ్చిన పాలనలాగా ఇది లేదు. తప్పులు ఉంటే సరిదిద్దాలి. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఫైల్ వేగంగా ఎలా కదిలింది. 500ఎకరాల సేకరణ వెనక పెద్దవాళ్లఎవరు? ఎంతమెత్తం చేతులుమారింది. వీటిని తేల్చలేదు. ప్రతిపాదించిన11 రోజుల వ్యవధిలోనే జీఓ ఎలా బయటకువచ్చింది. సిట్ దర్యాప్తు ఈ విధంగా సాగితే నిజాలు బయటకు వస్తాయా? సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి? మీరు చేసిందేమిటి? మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా? నిజానికి ఎన్టీఆర్ సీఎంగా మీరు(చంద్రబాబు) రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు1994,నవంబర్లో జారీ అయిన జీఓ ప్రకారమే ఇది జరిగింది. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల భూములకు సంబంధించి ఆ జీఓ మీ ఆదేశాలమేరకు జారీ అయింది. 1977లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు. సిట్ రిపోర్ట్ లో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్ద ఎవరో ఎందుకు తేల్చలేద’ని పలు ప్రశ్నలు ధర్మాన లేవనెత్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా