టీడీపీ పాలనకు ఇదే చివరి ఏడాది

16 Feb, 2018 12:18 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు

ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేస్తు్తన్న కేంద్రమంత్రి అశోక్‌

ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల టెండర్ల ఖరారులో అక్రమాలకు ఆస్కారం

విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ఇదే చివరి సంవత్సరమని, వారు చేస్తున్న అవినీతి అక్రమాలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్య కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఇటీవల చేసిన వాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు... విభజనచట్టంలో ఇచ్చిన హమీలు సాధనలో ఘోర వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఉత్తరాంధ్రలో కేంద్ర ప్రభుత్వం చేయతలపెట్టిన గిరిజన యూనివర్సీటీ, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాలతో పాటు విశాఖ రైల్వే సాధనలో మౌన నటన చేస్తూ ప్రజలను మోసగించడం నిజం కాదా అని ప్రశ్నించారు.

టెండర్ల ఖరారులో జాప్యం
జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ల ఖారరులో సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుల మధ్య   ముడుపుల లాలూచీలే కారణమని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాలు నిర్వహిస్తూ , ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రూ.1405 కోట్ల వ్యయంతో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సంస్థను కాదని ప్రైవేటు సంస్థకు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదే విషయంపై బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే  మండిపడుతున్న కేంద్రమంత్రి ఆ సంస్థకు  ఆ హోదా లేదంటూ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఏఏఐ సంస్థ కన్నా మిన్నగా ఇంకెవరు పనులు చేపట్టగలరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  తన స్వంత శాఖ అయిన కేంద్ర పౌరవిమాన శాఖలో ఒక్కటైన ఏఏఐ దేశంలో 22 ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణను చూస్తుండగా... ఆ సంస్థను కాదని వేరొకరికి పనులు అప్పగింతలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ టెండర్ల ఖరారులో జాప్యానికి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి అశోక్‌లు ముడుపులు అందుకోవడమే కారణంగా పేర్కొన్నారు. బడ్జెట్‌పై అధ్యయనం చేస్తున్నామంటూ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని విమర్శించారు.

హోదాతోనే అభివృద్ధి
విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మూలమని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని , చివరికి ఎంపిలతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కేవీ  సూర్యనారాయణరాజు, డీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్,  ఇంటి గోపాలరావు, కనకల రఘురామారావు, పతివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు