‘లోకేష్‌ చెప్పింది నిజమే.. 23 తప్పించుకున్నాయి’

9 Jul, 2019 13:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రజలు తిరస్కరించినా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు ఇంకా సిగ్గురాలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. పదవుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారగలరని.. నాలుగు పదాలు కూడా సరిగ్గా పలకలేని లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను లోకేష్‌  సరిగ్గా పలకాలని కోరుతున్నానని ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా...  సీఎం వైఎస్‌ జగన్‌ నీతి, నిజాయితీ, నిఖార్సైన నాయకుడు కాబట్టి గత ప్రభుత్వాల అవినీతిని బయటపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ పేపర్ మిల్లులు పెడ్తామని అవినీతికి పాల్పడ్డారు.. వాటిని ఈ అసెంబ్లీ సమావేశాలలో భయటపెడతామన్నారు. ‘ఇప్పుడు విద్యుత్, విత్తనాల కొరతలకి కారణం చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఏ తప్పు చెయ్యని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన మాటలు నిజమే అయితే విత్తనాల కొరతపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతుంటే... వైఎస్‌ జగన్ ప్రభుత్వం రైతులకు రూ. 1500 గిట్టుబాటు ధరను ఇచ్చింది. ఇప్పటికే నవరత్నాల హామీల అమలుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది’ అని చంద్రబాబు తీరును విమర్శించారు.

నువ్వెంత.. నీ పార్టీ ఎంత?
‘సీఎం వైఎస్‌ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్‌ జయంతి వేడుకలకు ప్రజలలోకి వెళ్తుంటే ప్రజలు వైఎస్సార్‌ సీపీ నాయకులకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ 40 రోజుల పాలనపై.. చంద్రబాబు 400 అబద్ధాలు సృష్టించారు. కరెంటు కోతలకు కారణం తెలుగుదేశం తొత్తులు గ్రామాల్లో ఫీజులు పీకడమేమోనని అనుమానం ఉంది. రాష్ట్రంలో విత్తన కొరతను, కరెంటు కోతలకు చంద్రబాబే కారణం. ఐదు సంతకాలు పెట్టిన మ్యానిఫెస్టోను సంతకు తోసేసిన చంద్రబాబుకు...  మ్యానిఫెస్టోను తన ఛాంబర్‌లో ఎదురుగుండా పెట్టుకున్న వైఎస్‌ జగన్‌కు అసలు పొంతనే లేదు. గత ప్రభుత్వంలో రూ. 5 వేల కోట్లుతో ధరల స్థిరీకరణ పెడతామని చంద్రబాబు చెప్పలేదా. నవరత్నాల అమలుకై చిత్తశుద్ధితో సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. బడిపిల్లలు పనిపిల్లలు కాకుండా ఉండేందుకు అమ్మఒడి పథకం తెచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు, ఆశావర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబే దాడులు చేయించి ఎల్లో మీడియాలో ఊదరకొడుతున్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న దొంగవు నీవు. నువ్వెంత  నీ పార్టీ ఎంత. టీడీపి వాళ్లకు, ఆ పార్టీకి ఓటువేసిన వారికి సైతం అభివృద్ధి ఫలాలు అందిస్తామనే లక్ష్యంతో సీఎం జగన్‌ ముందుకు సాగుతున్నారు’ అని సుధాకర్‌ బాబు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

23 పాములు తప్పించుకున్నాయి..
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ దయచేసి తెలుగు నేర్చుకోవాలంటూ సుధాకర్‌ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాములు పుట్టలనుంచి బయటకొచ్చాయి అంటున్నారు. ఆ మాట నిజం. గత 5 సంవత్సరాలలో అనేక పాములు బయటకొచ్చాయి. ప్రజలను హింసించాయి. వాటిని ప్రజలు చావగొట్టారు.  కానీ ఓ 23 పాములు మాత్రం తప్పించుకున్నాయి. అయితే అవి కూడా లోకల్ బాడి ఎన్నికలలో చనిపోతాయి.  చంద్రబాబు ప్రభుత్వం 2 లక్షల 50 కోట్ల రూపాయల అప్పులు చేసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది. నీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఇప్పుడు ఆ నీచ రాజకీయాలకు వారసుడిగా లోకేష్ వచ్చారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని లోకేష్‌ తీరును ఎండగట్టారు.

మరిన్ని వార్తలు