వినువీధిన విజయాల వందనం

13 Jan, 2018 12:18 IST|Sakshi
రాకెట్‌ ప్రయోగం అనంతరం ఉపగ్రహ నమూనాతో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు

గ‘ఘన’ కీర్తి గడించిన ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్క రించింది. త్రివర్ణ పతాకాన్ని వినువీధిన రెపరెపలాడించి విజయాల ‘వంద’నం చేసింది. 56 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో శుక్రవారం నాటి పీఎస్‌ఎల్వీ సీ–40 ప్రయోగంతో అంతరిక్షంలోకి 62 రాకెట్లను ప్రయోగిం చింది. వాటిద్వారా 100 స్వదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఘనతను నమోదు చేసుకుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా పంపించిన విదేశీ ఉపగ్రహాలతో కలిపితే ట్రిపుల్‌ సెంచరీకి చేరువ అవుతోంది.

గతేడాది ఫిబ్రవరి 15న 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన భారత శాస్త్రవేత్తలు శుక్రవారం మరో అద్భుతాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ఇస్రో తన అంతరిక్ష కదనాశ్వం పీఎస్‌ఎల్వీ సీ – 40 రాకెట్‌ ద్వారా 1,323 కిలోల బరువైన మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటివరకు రిమోట్‌ సెన్సింగ్, కమ్యూనికేషన్, గ్రహాంతర, నావిగేషన్, ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు మరో తరహా ఉపగ్రహాలను తయారు చేసుకొని ప్రయోగించే వారు. ఇప్పుడు మైక్రో, నానో ఉపగ్రహాల ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉద యం ప్రయోగించిన పీఎస్‌ ఎల్వీ రాకెట్‌ ద్వారా 100 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్, 11 కిలోల ఇండియన్‌ నానో శాటిలైట్‌ను రోదసీలోకి పంపించారు. ఇండియన్‌ నానో శాటిలైట్స్‌ సిరీస్‌లో ఇది మూడో ఉపగ్రహం కావడం విశేషం.

నానో శాటిలైట్స్‌ పనితీరు
ఇస్రో ఐఎన్‌ఎస్‌ – 1సీ ఉపగ్రహాన్ని ప్రయోగంలో పంపారు. అహ్మదాబాద్‌లో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు ఈ చిన్న తరహా ఉపగ్రహాన్ని తయారు చేసి ప్రయోగించారు. 11 కిలోల ఉపగ్రహంలో మూడు కిలోల బరువు కలిగిన పేలోడ్స్‌ను అమర్చారు. ఇది కూడా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ కావడం విశేషం. పేలోడ్‌తో భూమ్మీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమ్మీద రేడియేషన్‌ ఎనర్జీని మదింపు చేస్తుంది. ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ టోపోగ్రాఫిక్‌ మ్యాప్స్‌ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. విజిటేషన్‌ మానిటరింగ్, ఎయిర్‌సోల్‌ స్కాటరింగ్‌ స్టడీస్‌తో పాటు మేఘాలను అధ్యయనం చేస్తుంది.

మైక్రోశాట్‌ ఉపగ్రహ పనితీరు
పీఎస్‌ఎల్వీ సీ 40లో 100 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌ను పంపించారు. అయితే ఉపగ్రహాన్ని మాత్రం భూమికి 393 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. 30 ఉపగ్రహాలను 27.10 నిమిషాల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నాలుగోదశను మండించి మళ్లీ సుమారు 200 కిలోమీటర్లు కిందికి తీసుకొచ్చి 1.44 గంటలకు కక్ష్యలోకి విజయంతంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో రోదసీలోకి పంపే ఉపగ్రహాలు టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌గా ఉపయోగపడతాయి.

ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంపీ, ఎమ్యెల్యే అభినందనలు
సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్‌కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ 40 రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అభినందించారు. చైర్‌పర్సన్‌ నూలేటి విజయలక్ష్మి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరసా వెంకటరత్నయ్య, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వేనాటి రామచంద్రారెడ్డి, చెంగాళమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్‌ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, మాజీ చైర్మన్‌ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు