ఆరుషి కోసం.. 6 గంటల్లో.. 16 లక్షలు

3 Nov, 2018 18:40 IST|Sakshi
చిన్నారి ఆరుషి

పుట్టిన ప్రతి మనిషి ఎదుగుతాడు. ఏళ్లు శ్రమించి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ఎంత మురిసిపోయినా వారికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచేవి మాత్రం తమ చిన్నారి మొదటిసారి వేసిన బుడిబుడి అడుగులే. తప్పటడుగులతో ప్రారంభమయిన మనిషి జీవితం ఎన్నో మైళ్లు ప్రయాణించి విజయ తీరాలను చేరుకుంటుంది

కానీ ఆరుషి విషయంలో ఈ సంతోషాలు ఏవి లేవు. ఎందుకంటే ఆ చిన్నారి పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది.. ఆపై 20 రోజుల్లో తండ్రి కూడా మరణించాడు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఉ‍న్న తాతనాయనమ్మలే ఆ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబాన్ని విధి మరోసారి చిన్న చూపు చూసింది. నిండా మూడేళ్లు లేని ఆ పసిపాపకు దేవుడు ఖరీదైన జబ్బును బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు ‘కాన్‌జెనిటల్‌ సుడార్‌థ్రోసిస్‌ ఆఫ్‌ ద టిబియా’ (సీపీటీ). మన భాషలో చెప్పాలంటే విరిగిన కాలి ఎముక సరిగా అతుక్కోకపోవడమే కాక ఆ గాయం ఎన్నటికి మానదు. దాంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఎదురవుతోంది.

ప్రస్తుతం ఆరుషి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ చిన్నారి పుట్టి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకూ తొలి అడుగు వేయలేదు. కారణం సీపీటీ. చిన్నారి ఆరుషికి ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ జబ్బు బయటపడింది. దాంతో ఆ చిన్నారి నడవకూడదని చెప్పిన డాక్టర్లు.. ఆరుషి పాదాలకు బ్యాండేజ్‌ వేశారు. ఆపరేషన్‌ చేస్తే ఆ పాప కూడా అందరిలానే నడవగల్గుతుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అసలే అమ్మనాన్న లేక తాతనాయనమ్మల దగ్గర బతుకుతున్నారు. పూట గడవడమే కష్టం అంటే ఇక ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి వైద్యం చేయించడం వారి వల్ల అయ్యే పని కాదు.

ఎందుకంటే ఆరుషి తాత చేసేదేమో చిన్న సెక్యూరిటి గార్డ్‌ పని. వచ్చే మూడువేల జీతం రాళ్లతో నలుగురి కడుపులు నింపాలి. అలాంటిది 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి మనవరాలికి వైద్యం చేయించడం తన వల్ల కాదని అర్థమైంది. కానీ ఇంత బాధలోను మనవరాలి మొము మీద చిరునవ్వు చూసినప్పుడల్లా ఎలాగైనా ఆ చిన్నారిని నడిపించాలని ఆ ముసలి మనసు ఆరాటపడేది. దాంతో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సాయం కోరాడు. దీని వల్ల అంతగా ఉపయోగం లేకపోయింది. ఇలా అయితే లాభం లేదనుకుని తన దీన గాథను వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ స్టోరి పోస్ట్‌ చేశాడు. అతనికి తోడుగా ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చారు.

అలా ఆరుషి వ్యధ ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచమంతా తెలిసింది. మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. దాంతో కేవలం 6 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి వైద్యానికి కావాల్సిన 16 లక్షల రూపాయల సొమ్ము సమకూరింది. తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆరుషి కుటుంబ సభ్యులు. త్వరలోనే తమ మనవరాలు లేడిపిల్లలా గెంతుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు