తారె విజృంభణ.. ట్రోఫీ ముంబై వశం

20 Oct, 2018 17:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ముంబై మరో సారి మెరిసింది. విజయ్‌ హజారే 2018 ట్రోఫీని ముంబై వశం చేసుకుంది. శనివారం ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో టాపార్డర్‌ విఫలమైన మిడిలార్డర్‌ రాణించడంతో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 178 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై జట్టు ఇబ్బందులు పడింది. చివరకు 35.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. నవదీప్‌ సైనీ(3/53) దెబ్బకు శ్రేయస్‌ సేన  40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్లు పృథ్వీ షా(8), రహానే(10), సారథి శ్రేయస్‌ అయ్యర్‌ (7), సూర్యకుమార్‌ యాదవ్‌(4) విఫలమయ్యారు. ఈ క్రమంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఆదిత్య తారె (71), సిద్దేశ్‌ లాడ్‌(48)లు క్లిష్ట సమయంలో జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అనంతరం తారె వెనుదిరిగాడు. ఇక చివర్లో శివం దుబె(19 నాటౌట్‌) మెరిసి ముంబై గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీకి అనుకున్న ఆరంభం లభించలేదు. గంభీర్‌ సేన 45.4 ఓవర్లలో 177 పరుగుల స్వల్పస్కోర్‌కే ఆలౌటైంది. స్టార్‌ బ్యాట్స్‌మ్‌న్‌ గౌతమ గంభీర్‌(1), ఉన్ముక్త్‌ చంద్‌ (13) దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో జట్టును ధ్రువ్‌ షోరె(41), హిమ్మన్‌ సింగ్‌(31), పవన్‌ నేగి(21) రాణించడంతో ఢిల్లీ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. ముంబై బౌలర్లలో ధావల్‌ కులకర్ణి(3/30), శివం దుబే(3/29), తుషార్‌(2/30)లు రాణించారు.  

మరిన్ని వార్తలు