అదరగొట్టిన అన్వర్ అలీ

2 Aug, 2015 00:16 IST|Sakshi
అదరగొట్టిన అన్వర్ అలీ

కొలంబో: పాక్ లక్ష్యం 20 ఓవర్లలో 173 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 107/7... గెలవాలంటే 6 ఓవర్లలో 66 పరుగులు చేయాలి. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో బౌలర్లు అన్వర్ అలీ (17 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమద్ వసీమ్ (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. అయితే ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో మలింగ వీరికి ధీటుగా స్పందించాడు. అన్వర్ అలీని అవుట్ చేయడంతో పాటు సోహైల్ తన్వీర్ (1)నూ రనౌట్ చేసి ఉత్కంఠను పెంచాడు.

ఇక పాక్ గెలుపునకు 6 బంతుల్లో 6 పరుగులు అవసరమైతే.. లంక విజయానికి ఒక్క వికెట్ చాలు. ఈ దశలో ఫెర్నాండో వేసిన రెండో బంతిని వసీమ్ అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. అంతే ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఆఫ్రిది సేన వికెట్ తేడాతో శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది.

కపుగెడెరా (25 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జయసూరియా (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సిరివందన (23), కుశాల్ పెరీరా (19) మోస్తరుగా ఆడారు. షోయబ్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. తర్వాత పాక్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆఫ్రిది (22 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. లంక బౌలర్ల ధాటికి ఓ దశలో పాక్ 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆఫ్రిది, రిజ్వాన్ (17)లు ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో అన్వర్ అలీ, వసీమ్‌లు ఎనిమిదో వికెట్‌కు 27 బంతుల్లోనే 58 పరుగులు సమకూర్చారు.
 

మరిన్ని వార్తలు