ఆ క్రికెటర్ గాయాన్ని దాచిపెట్టాడు!

30 Mar, 2016 20:20 IST|Sakshi
ఆ క్రికెటర్ గాయాన్ని దాచిపెట్టాడు!

ఆఫ్రిది సీరియస్‌గా తీసుకోలేదు
దుమారం రేపుతున్న వకార్ నివేదిక


కరాచీ: ఆసియా కప్‌లోగానీ, టీ20 వరల్డ్ కప్‌లోగానీ పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సీరియస్‌గా ఆడలేదని ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్‌ ఆరోపించాడు. సీనియర్ బ్యాట్స్‌మన్‌ మహ్మద్ హఫీజ్‌ తనకు మోకాలి గాయమైనా.. ఆ విషయాన్ని దాచిపెట్టి టోర్నమెంటులో ఆడాడని వెల్లడించాడు. ఈ మేరకు వకార్ యూనిస్‌ పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన నివేదిక లీక్ అవ్వడం దుమారం రేపుతున్నది. తన నివేదికలోని కీలక అంశాలు లీకవ్వడంపై వకార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నిజానికి లెజండరీ బౌలర్ అయిన వకార్ యూనిస్‌కు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి సయోధ్య లేదు. 2011లో కోచ్‌గా వకార్‌ మొదటి పర్యాయంలోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తాజాగా బుధవారం లీకైన నివేదికలో వకార్ విస్మయం కలిగించే విషయాలు వెల్లడించాడు. ఆఫ్రిది సీరియస్‌గా కనిపించలేదని, ఆసియాకప్‌, వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శనపై అతను ఏమాత్రం శ్రద్ధ చూపలేదని  పేర్కొన్నాడు. ఆఫ్రిది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ సెషన్లకు, జట్టు సమావేశాలకు డుమ్మా కొట్టాడని తెలిపాడు.

ఇక సీనియర్ ఆటగాడు హఫీజ్‌ తనకు గాయముందనే విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు చెప్పలేదని, ఆ గాయం తిరగదోడడంతో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లతో కీలక మ్యాచులకు ముందు అతను జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది జట్టుపై ప్రభావం చూపిందని వకార్ వెల్లడించాడు. అయితే తాను అధికారికంగా ఇచ్చిన నివేదికలోని వివరాలు వెల్లడవ్వడంపై వకార్ యూనిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నివేదిక లీక్ కావడానికి కారణమెవరో గుర్తించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని అతను కోరాడు. 

మరిన్ని వార్తలు