'సార్‌...నన్ను ఆదుకోండి'

29 Dec, 2017 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: 12 ఏళ్ల వయసులో ఆర్చరీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించిన అసోంకు చెందిన గొహెలో బోరో ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతోంది. కొక్రాఝార్‌ జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన బోరో ఇప్పుడు సాయం కోసం దీనంగా క్రీడాశాఖను అర్థిస్తోంది. ఈ మేరకు తనకు తక్షణమే సాయం చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌కు లేఖ రాసింది. ఒకవేళ తనకు సాయం అందకపోతే తన ఆర్చరీ కలలు ఇంతటితో ఆగిపోతాయని 21 ఏళ్ల బోరో ఆ లేఖలో పేర్కొంది.


2008లో ఆర్చరీలోకి ప్రవేశించిన బోరో... 2015 కేరళ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. కెరీర్‌లో ఇప్పటివరకూ 77 పతకాలు గెలుచుకుంది. కాకపోతే  గతేడాది ఆమె సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథెమాటసస్(ఎస్‌ఎల్‌ఈ)‌, యాంటీ న్యూట్రోఫిల్‌ సైటోప్లాస్మిక్‌ యాంటీబాడీస్‌(ఏఎన్‌సీఏ) అనే వ్యాధి బారిన పడింది.  దాంతో తొలుత గుహవాటిలో చికిత్స పొందిన ఆమె.. ఆపై మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది.

కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా బోరో దుస్థితి గురించి తెలుసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎయిమ్స్‌లో చికిత్సకు అయిన మొత్తం చెల్లించింది. మే 21న ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యాక క్రీడా శాఖ ఆమెను పట్టించుకోవడం మానేసింది. అయితే నెల్లో ఒకసారి బోరో ఢిల్లీ వచ్చి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు, ఆమె నెలకు రూ. 3నుంచి 4 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఆ క్రమంలోనే వైద్య ఖర్చుల బిల్లులను రెండు సార్లు క్రీడా శాఖకు సమర్పించినా ఇప్పటిదాకా పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందుతోంది.

మరిన్ని వార్తలు