అజంతా మెండిస్‌ వీడ్కోలు

29 Aug, 2019 06:33 IST|Sakshi

 ‘మిస్టరీ’ స్పిన్నర్‌ రిటైర్మెంట్‌

కొలంబో: పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మిస్టరీ స్పిన్నర్‌ అజంతా మెండిస్‌. అతని దెబ్బకు టీమిండియా సిరీస్‌ కోల్పో యింది. మెండిస్‌ ‘క్యారమ్‌’ బంతులు మన బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. ఆరు ఇన్నింగ్స్‌లలో సచిన్, గంగూలీ కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోగా, ద్రవిడ్‌ మాత్రం ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు! మూడు టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. అయితే తర్వాతి రోజుల్లో ఆ మిస్టరీని బ్యాట్స్‌మెన్‌ ఛేదించిన తర్వాత అతను తేలిపోయాడు. ఒక సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్‌లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తరఫున 2015లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన అజంతా ఇప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు  వెల్లడించాడు. 19 టెస్టుల్లో 34.77 సగటుతో మెండిస్‌ 70 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 21.86 సగటుతో 152 వికెట్లు తీసిన అతను, 39 టి20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మెండిస్‌ పేరిటే అంతర్జాతీయ టి20ల్లో టాప్‌–2 బౌలింగ్‌ ప్రదర్శనలున్నాయి. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన అతను... అంతకుముందు ఏడాది ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.   
 

మరిన్ని వార్తలు