బస్తీల నుంచే బడా బాక్సర్లు

29 Sep, 2018 02:12 IST|Sakshi

బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ వ్యాఖ్య

తొలిసారి భారత్‌కు రాక

ముంబై: మురికివాడల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే పెద్ద పెద్ద బాక్సర్లుగా ఎదిగారని మాజీ ప్రపంచ హెవీవెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ చెప్పాడు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్‌ఎమ్‌ఏ) కుమిటే–1 లీగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌కు విచ్చేసిన ఈ బాక్సింగ్‌ దిగ్గజం మీడియాతో మాట్లాడుతూ ‘నాతో సహ చాలా మంది బాక్సర్లు మురికివాడల నుంచి కష్టపడి వచ్చినవాళ్లే! వాళ్లంతా ఇప్పుడు మేటి బాక్సర్లయ్యారు. ప్రస్తుతమున్న టాప్‌ బాక్సర్లు కూడా బస్తీలకు చెందిన వారే’ అని అన్నాడు. 52 ఏళ్ల మాజీ బాక్సర్‌ 2005లో రిటైరయ్యాడు. అతను 1988లో 20 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్‌ చాంపియన్‌షిప్‌ సాధించి ఈ ఘనత సాధించిన తొలి యువ బాక్సర్‌గా రికార్డులకెక్కాడు. తన కెరీర్‌లో 50 విజయాలు సాధించగా... ఇందులో 44 నాకౌట్లుండటం విశేషం. కేవలం ఆరు బౌట్లలో మాత్రం ఓటమి పాలయ్యాడు.   గొప్ప విజయాలే కాకుండా వివాదాలూ టైసన్‌ వెంట నడిచాయి.

1991లో ‘మిస్‌ బ్లాక్‌ రోడ్‌ ఐలాండ్‌’ డిజైరీ వాషింగ్టన్‌పై అత్యాచారం చేసి ఆరేళ్ల శిక్షకు గురయ్యాడు. అనంతరం 1997లో ఇవాండర్‌ హోలీఫీల్డ్‌తో జరిగిన బౌట్‌లో హోలీఫీల్డ్‌ చెవిని కొరికి డిస్‌క్వాలిఫై అయ్యాడు. భారత పర్యటనలో అతను ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిని, అలాగే ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ సందర్భంగా టైసన్‌ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నేనూ పేదవాణ్నే. మురికివాడలోనే పుట్టిపెరిగా. వాడల నుంచి బయటపడాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. అనుకున్నది సాధించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను. ఎవరైనా సరే చెమటోడ్చితే అక్కడ్నించి బయటపడొచ్చు. ఎంతో బాగా ఎదగొచ్చు’ అని టైసన్‌ చెప్పాడు. తనకు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌అంటే చాలా ఇష్టమన్నాడు. లాస్‌ వెగాస్‌లో జరిగే యూఎఫ్‌సీ పోటీలను తిలకించేవాడినని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ గురించి మాట్లాడుతూ ఈ ఆట తనకు తెలుసని బేస్‌బాల్‌లా ఉంటుందని, బ్యాట్‌తో బంతిని బాదే ఆటే క్రికెట్‌ అని చెప్పాడు. ఎమ్‌ఎమ్‌ఏ కుమిటే–1 లీగ్‌లో భాగంగా శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య తొలి ఫైట్‌ జరగనుంది.    

మరిన్ని వార్తలు