నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?

18 Apr, 2020 10:12 IST|Sakshi

ఆ రోజు ధోనిని చూస్తే భయమేసింది

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి మరో పేరు మిస్టర్‌ కూల్‌. మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ధోని తన ప్రణాళికల్ని కూల్‌గానే చక్కబెట్టేస్తాడు. ఫలితంగా మిస్టర్‌ కూల్‌ బిరుదును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఎంతటి ఒత్తిడిలో ఉన్నా ధోని మాత్రం తన ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలు చాలా అరుదు. అలా ధోనిలో కోపాన్ని చవిచూసిన అరుదైన జాబితాలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒకడట. మూడేళ్ల క్రితం శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భాగంగా కుల్దీప్‌పై గట్టిగానే అరిచాడట ధోని. తన సలహాను కుల్దీప్‌ పట్టించుకోవడమే ఇందుకు కారణమైంది. ఈ విషయాన్ని కుల్దీప్‌ తాజాగా స్పష్టం చేశాడు. ఆనాటి మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు కుశాల్‌ పెరీరా కవర్స్‌ వైపు షాట్‌ ఆడి బౌండరీ సాధించగా, ఆ తర్వాత బంతికి ఫీల్డింగ్‌ సెట్‌ చేసుకోమని ధోని చెప్పాడట. కాగా, అది వినిపించకపోవడంతో తాను ఎటువంటి ఫీల్డింగ్‌ సెట్‌ చేసుకోకుండా బౌలింగ్‌ చేసి ధోని ఆగ్రహానికి గురైనట్లు కుల్దీప్‌ చెప్పుకొచ్చాడు. ('అతని బ్యాటింగ్‌ చూసి 11ఏళ్ల స్పిన్నర్‌లా ఫీలయ్యా')

‘నా బౌలింగ్‌లో ఒక బంతిని కుశాల్‌ పెరీర కవర్స్‌ మీదుగా బౌండరీ బాదాడు. అయితే, తర్వాతి బంతికి ఫీల్డింగ్‌ను మార్చుకోవాలని వికెట్ల వెనకాల నుంచి ధోని గట్టిగా అరుస్తూ చెప్పాడు. నాకు అతడి మాట వినిపించకపోవడంతో ఎప్పటిలాగే బంతి వేశా.  అదీ రివర్స్‌ స్వీప్‌ షాట్‌తో బౌండరీకి వెళ్లింది.  దాంతో పట్టరాని కోపంతో ధోని నా దగ్గరకు వచ్చి గట్టిగా అరిచాడు. నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? 300 వన్డేలు ఆడా. అయినా, నువ్వు నా మాట వినడం లేదు’ అంటూ ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడని కుల్దీప్‌ తెలిపాడు. అలా ధోనిలో కోపాన్నిచూడటం తొలిసారని, ఆ రోజు మిస్టర్‌ కూల్‌ను చూస్తే తనకు భయమేసిందన్నాడు. కాకపోతే ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత తామంతా హోటల్‌  రూమ్‌కు చేరుకున్నామని, అప్పుడే ధోని కోపం గురించి అతన్నే అడిగేశానన్నాడు. అయితే దానికి ధోనికి ఒక ఆసక్తికర సమాధానం చెప్పాడని కుల్దీప్‌ తెలిపాడు. ‘ 20 ఏళ్లుగా నాకు కోపం రాలేదు. ఎప్పుడో రంజీలు ఆడే రోజుల్లో ఆటగాళ్‌లపై ఆగ్రహించే వాడిని. ఫీల్డ్‌లో సాధారణంగా అరుస్తూ ఉంటాను కానీ అది కోపం కాదు’ అని ధోని సమాధానమిచ్చాడని కుల్దీప్‌ గత జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు.(ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!)

మరిన్ని వార్తలు