పట్టుదల, కృషితోనే లక్ష్య సాధన: హంపి

2 Jan, 2020 01:20 IST|Sakshi

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌కు ఘనస్వాగతం

సాక్షి, గన్నవరం: వర్ధమాన క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచ ర్యాపిడ్‌ మహిళల చెస్‌ చాంపియన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తెలిపింది. మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌గా ఉన్న 32 ఏళ్ల హంపి రష్యాలో గతవారం జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల ర్యాపిడ్‌ విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హంపి బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ చేరుకుంది. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌), ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘం (ఏపీఓఏ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

‘శాప్‌’ నుంచి స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ రమణ, ఓఎస్‌డీ రామకృష్ణ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జీ.మధుసూదనరావు... ఏపీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు శ్రీహరి, నామిశెట్టి వెంకటేశ్వరరావు, ధనియాల నాగరాజు, చెరుకూరి సత్యనారాయణ, అర్జా పాండురంగారావు, ఆర్చరీ క్రీడాకారిణి చెరుకూరి డాలీ, హంపి భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో హంపి మీడియాతో మాట్లాడింది. ‘తండ్రి అశోక్‌ నిరంతరం ఇచ్చే విలువైన సూచనలతో చెస్‌లో ఉన్నతస్థితికి చేరుకున్నాను. ఆయన శిక్షణలో మరింతగా రాటుదేలి భవిష్యత్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాను. భర్త అన్వేష్‌ ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతోనే చెస్‌లో పునరాగమనం చేయగలిగాను. ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించాను. క్లాసికల్‌ విభాగంలో విశ్వవిజేతగా నిలువడమే తదుపరి లక్ష్యం’ అని హంపి వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు