సచిన్‌ చెప్పాడని...

29 Jun, 2017 00:07 IST|Sakshi
సచిన్‌ చెప్పాడని...

కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్‌ ఎంపిక అనివార్యమైంది. ముందుగా టామ్‌ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్‌ పైబస్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నా ఇప్పుడు రవిశాస్త్రి తెరమీదికొచ్చారు. ఉన్నపళంగా ఆయన దరఖాస్తు చేయడం ఆశ్చర్యపరిచినా... సచిన్‌ సూచనతోనే లండన్‌లో ఉన్న ఆయన కోచ్‌ పదవిపై ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. కెప్టెన్‌ కోహ్లి కూడా శాస్త్రిపైనే మొగ్గుచూపుతుండటంతో కోచ్‌ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

కోచ్‌ రేసులోకి వచ్చిన రవిశాస్త్రి  
ముంబై: అనిల్‌ కుంబ్లే కంటే ముందు టీమిండియాను రవిశాస్త్రి డైరెక్టర్‌ హోదాతో నడిపించాడు. ఆయన మార్గదర్శనంలోనే భారత జట్టు టి20, వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్‌ చేరింది. ఏడాది తర్వాత తాజాగా కుంబ్లే–కోహ్లి వివాదంతో ఖాళీ అయిన కోచ్‌ పదవిపై మొదట్లో ఆసక్తి కనబరచని రవిశాస్త్రి అనూహ్యంగా తానూ దరఖాస్తు చేస్తున్నానని చెప్పారు. ఇప్పటిదాకా టామ్‌ మూడీ, సెహ్వాగ్, రాజ్‌పుత్‌లు రేసులో ఉండగా... తాజాగా ఈ జాబితాలో శాస్త్రి చేరారు.

ఇది ఎవరూ ఊహించని పరిణామమైనప్పటికీ... ఒకే ఒక్కరి సూచనతో ఈ రేస్‌ ముఖచిత్రం మారింది. ఆయనే సచిన్‌ టెండూల్కర్‌. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్‌ చెప్పాడనే రవిశాస్త్రి తెరమీదికొచ్చారు. మొదట కోచ్‌ కోసం క్యూ లైన్‌లో నిలబడనన్న వ్యక్తి (శాస్త్రి) రేసులోకి రావడానికి కారణం సచినే అని తెలిసింది. కెప్టెన్‌ కోహ్లి కూడా మాజీ టీమ్‌ డైరెక్టర్‌ వైపే మొగ్గుచూపుతుండటంతో రేపోమాపో రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అపుడూ... ఇపుడూ ‘మాస్టరే’ మద్దతు
నిజానికి... ఏడాది క్రితమే కుంబ్లేతో రవిశాస్త్రి పోటీపడ్డారు. అప్పుడూ సచిన్‌ సీఏసీ ఇంటర్వ్యూలో ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. కానీ గంగూలీ... కుంబ్లేవైపు మొగ్గుచూపడం, మరో సభ్యుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా కుంబ్లేకే ఓటేయడంతో రవిశాస్త్రి కథ కంచికి చేరింది. దీనిపై ఈ మాజీ డైరెక్టర్‌ బాహటంగానే గంగూలీని విమర్శించారు. ఇపుడు కూడా కోచ్‌ పదవికి అర్హుడిని తేల్చేది సీఏసీనే కాబట్టి గంగూలీ వ్యతిరేకత దృష్ట్యా తనకు ఆ అవకాశం రాదని రవిశాస్త్రి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎంచక్కా కుటుంబంతో లండన్‌లో సేదతీరుతున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అక్కడి నుంచే కోచ్‌ పదవిపై తన ఆసక్తిని తెలిపారు. ఈ ఆశ్చర్యపరిణామానికి లండన్‌లోనే ఉన్న సచినే కారణమని సమాచారం.  

అనిల్‌ను అవమానించారు: సన్నీ
కోచ్, కెప్టెన్‌ల వివాదంపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తొలిసారి ఘాటుగా స్పందించారు. అందరూ కలిసి ఓ దిగ్గజ బౌలర్‌ను అవమానించారని అన్నారు. ‘కుంబ్లేకు ఎదురైన అనుభవం చూస్తుంటే బాధేస్తోంది. భారత క్రికెట్‌ లెజెండ్‌ను ఇంతలా అగౌరవపరచడం శోచనీయం. కుంబ్లే లాంటి మేటి ఆటగాడికే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఇకపై ఏ టాప్‌స్టార్‌ భారత కోచ్‌ పదవిపై ఆసక్తి కనబరచడు. దీంతో ఫలితాలు సాధించే కోచ్‌ను భారత క్రికెటర్లు సహించలేరనే విషయం ఈపాటికే అందరికీ అర్థమైంది’ అని సన్నీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు