మరో 24 మంది మాజీ క్రికెటర్లకు ఐసీఏ చేయూత 

21 Jun, 2020 00:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్లను ఆదుకునేందుకు నడుం బిగించిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) రూ. 78 లక్షల రూపాయలను సేకరించిందని ఐసీఏ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ మొత్తంతో తాజాగా మరో 24 మాజీ క్రికెటర్లకు ఆర్థిక సహాయం చేసే వీలు కలుగుతుందని ఆయన అన్నారు. తొలుత 20 నుంచి 25 మంది ప్లేయర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అయితే పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు రావడంతో మొత్తం 57 మందికి సాయం చేసే అవకాశం లభించిందన్నారు. తాజా జాబితాలో 2012 అంధుల టి20 ప్రపంచకప్, 2014 అంధుల వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు జట్టును చాంపియన్‌గా నిలిపిన శేఖర్‌ నాయక్‌ ఉన్నాడు. గత ఏడాది ఏర్పాటైన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)లో మొత్తం 1,750 మంది మాజీ క్రికెటర్లు సభ్యత్వం తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఏకు బీసీసీఐ రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది.

మరిన్ని వార్తలు