నన్ను కావాలనే విస్మరించారు: గుత్తా జ్వాల

26 Jan, 2017 14:21 IST|Sakshi
నన్ను కావాలనే విస్మరించారు: గుత్తా జ్వాల

హైదరాబాద్: తనకు పద్మ పురస్కారం దక్కకపోవడం పట్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మూడుసార్లు దరఖాస్తు చేసినా తనను విస్మరించారని వాపోయింది. తనను కావాలనే విస్మరించారని ఆరోపించింది. మిక్స్ డ్ డబుల్స్, మహిళ డబుల్స్ లో టాప్- 10లో ఉన్న తనను ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేయకపోవడం బాధ కలిగించిందని తెలిపింది.

‘15 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నాను. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సత్తా చాటాను. అన్ని అర్హతలు ఉన్నాయనే పద్మ అవార్డు కోసం దరఖాస్తు చేశాను. కానీ ఇది సరిపోలేదు. అవార్డు రావాలంటే రికమండేషన్ ఉండాలి. రికమండేషన్ ఉంటేనే అవార్డుకు ఎంపిక  చేస్తామంటే దరఖాస్తులు ఆహ్వానించడం దేనికి? పద్మ పురస్కారాలకు నేను సాధించిన విజయాలు సరిపోవా? ఈ మొత్తం వ్యవహారం నాకు అంతుపట్టకుండా ఉంది.

నేను సాధించిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, గ్లాస్కో లో వెండి పతకం.. ప్రపంచ చాంపియన్‌ షిప్స్ మెడల్స్‌ సరిపోవా? 15 సార్లు నేషనల్ చాంపియన్‌ షిప్ గెలిచాను. ఇలా ఎన్నో ఘనతలు సాధించాను. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అందరికీ మార్గదర్శకంగా నిలిచాను. కానీ ఇవేమి సరిపోలేదు. ఎందుకంటే నేను ముక్కుసూటి మనిషిని. అందుకే నాకు అవార్డు నిరాకరించార’ ని జ్వాల తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చింది.

మరిన్ని వార్తలు