ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సరిత

21 Dec, 2016 00:22 IST|Sakshi
ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సరిత

ఢిల్లీ: భారత మహిళల బాక్సింగ్‌లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా బాక్సర్‌ సరితా దేవి ప్రొఫెషనల్‌గా మారనుంది. తద్వారా ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు లైసెన్స్‌ కలిగిన భారత బాక్సింగ్‌ కౌన్సిల్‌ (ఐబీసీ)తో రెండేళ్ల కాలానికి ఆమె ఒప్పందం చేసుకుంది. భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అనుమతిస్తే అమెచ్యూర్‌ సర్క్యూట్‌లోనూ కొనసాగుతానని 31 ఏళ్ల సరితా దేవి తెలిపింది.

‘దశాబ్దంకంటే ఎక్కువ కాలం నుంచి నేను అమెచ్యూర్‌ బాక్సర్‌గా ఉన్నాను. ఒలింపిక్స్‌ మినహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాను. ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకే ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని 60 కేజీల విభాగంలో పోటీపడే సరిత వివరించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి 19న సరితా దేవి తొలి ప్రొఫెషనల్‌ బౌట్‌ జరిగే అవకాశముంది

మరిన్ని వార్తలు