ఐసీసీ చైర్మన్‌గా మనోహర్

9 Nov, 2015 23:41 IST|Sakshi
ఐసీసీ చైర్మన్‌గా మనోహర్

శ్రీనివాసన్ తొలగింపు   
బీసీసీఐ కీలక నిర్ణయం

 
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిపాలనలో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసిన నారాయణస్వామి శ్రీనివాసన్ శకం ముగిసింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత ప్రతినిధిగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్‌ను తప్పిస్తూ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవిలో మనోహర్ జూన్ 2016 వరకు కొనసాగుతారు. ఏదైనా కారణంతో ఆయన గైర్హాజరైతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయ డెరైక్టర్ హోదాలో బీసీసీఐ తరఫున శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. పలు కారణాలతో అనేక సార్లు వాయిదా పడిన బోర్డు ఏజీఎం ఎట్టకేలకు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో భారత క్రికెట్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసన్‌ను తొలగిస్తూ ప్రకటన చేసిన తర్వాత ఐసీసీ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలను బోర్డు సభ్యులు ప్రస్తుతించారు.
 
ఐపీఎల్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రి అవుట్

ఈ సమావేశంలో బోర్డు వేర్వేరు సబ్ కమిటీలను ప్రకటించింది. కొన్నింటిలో సభ్యులను మార్చగా, మరికొన్ని కమిటీల్లో సభ్యుల సంఖ్యను బాగా తగ్గించారు. ఐదుగురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా రాజీవ్‌శుక్లా కొనసాగనున్నారు. అయితే భారత జట్టు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిని ఈ కౌన్సిల్‌నుంచి తప్పించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరవ్ గంగూలీని ఎంపిక చేశారు. బోర్డు సభ్యుల కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పవర విరుద్ధ ప్రయోజనాల సంఘర్షణ)కు సంబంధించి తీవ్రంగా చర్చ జరిగినా చెప్పుకోదగిన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అయితే ఈ తరహా కార్యకలాపాలను బోర్డు తరఫున పర్యవేక్షించేందుకు తొలిసారి మాజీ న్యాయమూర్తి ఏపీ షా ను ‘అంబుడ్స్‌మన్’గా నియమించారు.
 

మరిన్ని వార్తలు