భారత్‌తో ఆడుతాం.. కోహ్లితో కాదు

15 May, 2018 15:46 IST|Sakshi
విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

అఫ్గాన్‌ కెప్టెన్‌ అస్గార్‌ స్టానిక్‌జాయ్

ముంబై : భారత్‌తో చారిత్రత్మక టెస్టుకు తమ జట్టు సిద్దంగా ఉందని అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ అస్గార్‌ స్టానిక్‌జాయ్ తెలిపాడు. ఈ చారిత్రత్మక టెస్టుకు టీమిండియా కెప్టెన్‌ కోహ్లి దూరం కావడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. అఫ్గాన్‌తో టెస్టుకు కోహ్లి దూరం కావడంపై విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్గార్‌ స్పందించాడు. తాము భారత్‌తో ఆడటానికి సిద్దంగా ఉన్నామని, కోహ్లి ఒక్కడితో ఆడటానికి కాదని పేర్కొన్నాడు. ‘‘ భారత ఆటగాళ్లందరూ.. కోహ్లి సామర్థ్యానికి సమానులే. మేం భారత్‌తో ఆడుతాం. కానీ కోహ్లితో కాదు.’ అని తెలిపాడు. 

భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని, ఇది తమకు కలిసొచ్చే అంశమని అస్గార్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ భారత పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అదృష్టవశాత్తు మా జట్టులో మంచి స్పిన్నర్లున్నారు. రషీద్‌, ముజీబ్‌ల ప్రదర్శన మేం గర్వించేలా ఉంది. మా బ్యాట్స్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మూడు, నాలుగేళ్లుగా మా జట్టు సమన్వయం బాగుంది. మేం మంచి క్రికెట్‌ ఆడటానికి ప్రయత్నిస్తాం.’’ అని తెలిపాడు.

ఇంగ్లండ్‌ పర్యటన దృష్ట్యా కోహ్లి కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు వెళ్తుండటంతో చారిత్రత్మక టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. జూన్‌ 14 నుంచి బెంగళూరు వేదికగా జరిగే ఈ టెస్టు అఫ్గాన్‌కు తొలి అంతర్జాతీయ టెస్టు. కోహ్లి గైర్హాజరితో అజింక్యా రహానే టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు.

మరిన్ని వార్తలు