లంకపైనా గోల్స్‌ వర్షం 

29 Aug, 2018 01:21 IST|Sakshi

20–0తో భారత హాకీ జట్టు గెలుపు

ఆరు గోల్స్‌ కొట్టిన ఆకాశ్‌దీప్‌ సింగ్‌

జకార్తా: ఏషియాడ్‌ పురుషుల హాకీలో భారత్‌ భారీ సంఖ్యలో గోల్స్‌తో అదరగొడుతోంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన పూల్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 20–0తో జయభేరి మోగించింది. భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (9, 11, 17, 22, 32, 42వ నిమిషాల్లో) ఆరు గోల్స్‌ చేయడం విశేషం. రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (1, 52, 53వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (5, 21, 33వ ని.), మన్‌దీప్‌ సింగ్‌ (35, 43, 59వ ని.) మూడేసి కొట్టారు. లలిత్‌  రెండు, ప్రసాద్, అమిత్, దిల్‌ప్రీత్‌ సింగ్‌ తలా ఒక గోల్‌ సాధించారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ పూల్‌ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. పూల్‌ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో గురువారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా తలపడతుంది. మరో సెమీఫైనల్లో కొరియాతో పాక్‌ ఆడుతుంది. 

బాక్సింగ్‌లో నిరాశ...
ఏషియాడ్‌ మహిళల బాక్సింగ్‌లో మంగళవారం భారత్‌కు నిరాశ ఎదురైంది. 57 కేజీల విభాగంలో సోనియా లాథర్‌ 0–5తో ఉత్తర కొరియా బాక్సర్‌ జొ సన్‌ హ్వా చేతిలో ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో పవిత్ర 2–3తో హుస్వాతున్‌ హసనాహ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. 

మరిన్ని వార్తలు