సాక్షికి రజతం

13 May, 2017 00:28 IST|Sakshi
సాక్షికి రజతం

వినేశ్, దివ్యలకు కూడా
ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌


న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో భారత్‌కు మూడు రజతాలు, ఒక కాంస్యం దక్కింది. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌తో పాటు వినేశ్‌ ఫోగట్, దివ్యా కక్రన్‌ కూడా రజత పతకాలు సాధించగా, రీతూ ఫోగట్‌ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఫైనల్‌ చేరిన సాక్షి, తుదిపోరులో నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 60 కేజీల కేటగిరీ ఫైనల్లో సాక్షి 0–10తో రియో స్వర్ణ పతక విజేత రిసాకో కవాయి (జపాన్‌) చేతిలో చిత్తుగా ఓడింది. ‘నాకు ఈ రోజు ఏదీ కలిసిరాలేదు.

అయితే తదుపరి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు కృషి చేస్తా’ అని 24 ఏళ్ల సాక్షి పేర్కొంది. మహిళల 55 కేజీల తుదిపోరులో వినేశ్‌ 4–8తో నాన్జో సే చేతిలో ఓడింది. ‘గాయం నుంచి కోలుకున్న తర్వాత బరిలోకి దిగిన నేను ఇంత బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. రజత ప్రదర్శనపై సంతృప్తిగానే ఉంది’ అని వినేశ్‌ ఫోగట్‌ తెలిపింది. మరో భారత రెజ్లర్‌ దివ్య కూడా టైటిల్‌ పోరులో పరాజయం చవిచూసింది. 69 కేజీ కేటగిరీ ఫైనల్లో దివ్య 0–8తో జపాన్‌కే చెందిన సారా దొషో చేతిలో చిత్తుగా ఓడింది. 48 కేజీల కేటగిరీలో రీతూ ఫోగట్‌కు  కాంస్యం దక్కింది. గాయం కారణంగా ప్రత్యర్థి యానన్‌ సన్‌ (చైనా)నుంచి రీతూకు వాకోవర్‌ లభించింది.

మరిన్ని వార్తలు