మరో ఓటమి దిశగా...

26 Dec, 2013 22:58 IST|Sakshi
మరో ఓటమి దిశగా...

అడిలైడ్: బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్న ఇంగ్లండ్.. యాషెస్2013 సిరీస్‌లోని రెండో టెస్టులో ఓటమికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులు చేసింది. ప్రయర్ (31 బ్యాటింగ్), బ్రాడ్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 284 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు ఆఖరి రోజైన సోమవారం వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదిక. అంతకుముందు నాలుగోరోజు ఉదయం ఆస్ట్రేలియా జట్టు ఓవర్‌నైట్ స్కోరు 132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

 భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పర్యాటక జట్టు ఓపెనర్లు కుక్ (1), కార్‌బెరీ (14)లు శుభారంభానివ్వడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్ (194 బంతుల్లో 87; 9 ఫోర్లు), పీటర్సన్ (99 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఆసీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నిలకడగా ఆడారు. అయితే మూడో వికెట్‌కు 111 పరుగుల జోడించాక పీటర్సన్‌ను సిడిల్ వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే బెల్ (6) కూడా అవుట్‌కావడంతో ఇంగ్లండ్ 143 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

రూట్, స్టోక్స్ (90 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నా... ఎక్కువసేపు నిలబడలేకపోయారు. సెంచరీ దిశగా సాగుతున్న రూట్‌ను లియోన్ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత ప్రయర్‌తో కలిసి స్టోక్స్ ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించి అవుటయ్యాడు. ఆట చివర్లో వచ్చిన బ్రాడ్ నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ మరో వికెట్‌ను కోల్పోకుండా రోజును ముగించింది.

మరిన్ని వార్తలు