కరోనా ఎఫెక్ట్‌ : ఆసీస్‌-కివీస్‌ సిరీస్‌ రద్దు

14 Mar, 2020 11:17 IST|Sakshi

సిడ్నీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ అర్థంతరంగా రద్దు చేసుకుంది. దేశంలో కోవిడ్‌-19ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చేవారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చినవారిని ఏయిర్‌పోర్ట్‌లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్‌ పర్యటనలో ఉన్న కివీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ అలర్ట్‌ అయింది. న్యూజిలాండ్‌లో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు అమలుకాకముందే తమ దేశానికి వెళ్లిపోవాలని కివీస్‌ జట్టు అనుకుంది. దీంతో ఆదివారం జరగాల్సిన రెండో వన్డేతో పాటు మిగిలిన టీ20 సిరీస్‌ను కూడా వాయిదా వేసుకొని బయలుదేరనుంది. (ఐపీఎల్‌ 2020 వాయిదా)

అంతకుమందు శుక్రవారం కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఆసీస్‌ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్‌ అనంతరం కివీస్‌ పేస్‌ బౌలర్‌ లోకి ఫెర్గూసన్‌ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా పరీక్షల నిమ్మితం ఐసోలేషన్‌ వార్డుకు తరలించింది. ఇదే విషయమై న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ' మ్యాచ్‌ ముగిసిన అనంతరం లోకి ఫెర్గూసన్‌ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో అతన్ని హోటల్‌ రూంలోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో ఉంచాం. 24 గంటల పాటు అతను అబ్జర్వేషన్‌లో ఉండనున్నాడు. కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్నది అతని రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత తెలుస్తుందని' పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు కరోనా సోకిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తేల్చా చెప్పింది. అతని రిపోర్ట్స్‌ పరిశీలించిన తర్వాత కరోనా నెగిటివ్‌ అని తేలిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. (భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ రద్దు!)

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగతా రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. (రిచర్డ్సన్‌కు కరోనా లేదు)

మరిన్ని వార్తలు