మయాంక్‌ని కించపరిచిన ఆస్ట్రేలియా కామెంటేటర్‌

26 Dec, 2018 15:09 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : భారత్‌- ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా ఆసీస్‌ కామెంటేటర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న కర్ణాటక ప్లేయర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై కామెంటేటర్‌ ఓ.కీఫ్‌  అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు... భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను అవమానించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మయాంక్‌ 304 పరుగులు సాధించి అజేయ ట్రిపుల్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 2017-18లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్‌ సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి 76 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో.. మయాంక్‌ సాధించిన ట్రిపుల్‌ సెంచరీ పెద్ద విషమేమీకాదనీ ఓ.కీఫ్‌ వ్యాఖ్యానించాడు. ఏ క్యాంటీన్‌ జట్టుపైనో లేదా వెయిటర్స్‌ టీమ్‌పైనో అతడు 304 పరగులు చేసి ఉండొచ్చని అన్నాడు. దీంతో ట్విటర్‌ వేదికగా ఓ.కీఫ్‌ను క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ‘వెటకారపు, వెకిలి నవ్వుల కోసం మరో దేశాన్ని కించపరుస్తారా’ అంటూ మండిపడుతున్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మానుకోండని హితవు పలుకుతున్నారు.

ఇదిలా ఉండగా.. 2013లో జార్ఖండ్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్‌.. 46 ఫస్ట్‌క్లాస్‌, 75 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. దాదాపు 50 సగటుతో రాణించాడు. కాగా, 1971-1977 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన కీఫ్‌ లెగ్‌ స్పిన్నర్‌. 24 టెస్టులు ఆడిన అతను 53 వికెట్లు తీశాడు. అనంతరం క్రికెట్‌ కామెంటేటర్‌గా మారి... విలక్షణమైన వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు.

>
మరిన్ని వార్తలు