జ్వాలపై ప్రేక్షకుల అనుచిత వ్యాఖ్యలు

27 Aug, 2013 02:52 IST|Sakshi
జ్వాలపై ప్రేక్షకుల అనుచిత వ్యాఖ్యలు

 న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఆదివారం బంగా బీట్స్‌తో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు జ్వాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి తీవ్ర మనస్తాపం చెందింది. మ్యాచ్ ముగిశాక ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఐబీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఎవరికి వారు సభ్యత నేర్చుకోవాలని సూచించింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి.
 
 ఇలాంటి పరిస్థితి క్రికెటర్లకు వస్తే మైదానంలో వారు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాం. కానీ నేను కోర్టులో ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. మ్యాచ్ తర్వాతే నా ఆవేదన తెలిపాను. ఈరోజుల్లో ఎవరికి వారు చాలా బిజీగా మారిపోతున్నాం. అందుకే మనం పిల్లలకు కనీస విలువలు, మానవత్వం గురించి చెప్పడం మర్చిపోతున్నాం. మహిళల పట్ల భారత సమాజం ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో భారత్ ఎలా దూసుకెళుతుందో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు మీలో సంకుచిత మనస్తత్వాన్ని తెలుపుతాయి. డాక్టర్‌గానో ఇంజినీర్ గానో కావడం ముఖ్యం కాదు. ఎవరి పిల్లలకు వారు మంచి సంస్కృతిని నేర్పితే చాలు’ అని జ్వాల పేర్కొంది.
 

మరిన్ని వార్తలు