ఆర్టీఏలో ‘పోస్టు’ల పేరిట వసూళ్లు ! | Sakshi
Sakshi News home page

ఆర్టీఏలో ‘పోస్టు’ల పేరిట వసూళ్లు !

Published Tue, Aug 27 2013 2:48 AM

Money collection on RTA Post

సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల పేరిట హోంగార్డుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అక్రమాల పర్వం తాజాగా మరో మలుపు తిరిగింది. హోంగార్డులకే ఆ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఫైలుపై సంతకం చేశారంటూ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులు మరోసారి పెద్ద ఎత్తున వసూళ్లకు దిగినట్లు సమాచారం. రాజమండ్రికి చెందిన ఓ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్, నగరానికి చెందిన ఒకరిద్దరు హోంగార్డులు కలిసి సాగించిన ఈ వసూళ్ల పర్వంలో వందలాది మంది హోంగార్డులు మోసపోయారు.
 
వివరాల్లోకి వెళితే.. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న 250 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెండేళ్ల క్రితమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోస్టుల భర్తీలో సాంకేతిక అంశాలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు భర్తీ ప్రక్రియను చేపట్టలేదు. ఈ క్రమంలో, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఆర్టీఏలో పనిచేస్తున్న హోంగార్డులనే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయాలని హోంగార్డుల సంఘం రవాణాశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో రాజమండ్రికి చెందిన ఓ మోటారు వాహన తనిఖీ అధికారి సూత్రధారిగా వ్యవహరించారు. ప్రభుత్వ పెద్దలతో తనకు ఉన్న పరిచయాల దృష్ట్యా ఆ పోస్టులు హోంగార్డులకే ఇప్పించగలనని నమ్మించి వసూళ్లకు దిగాడు.

ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు హోంగార్డులను అనుచరులుగా ఎంపిక చేసుకొని ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఇలా సుమారు రూ.6 కోట్ల దాకా కొల్లగొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు ముట్టజె ప్పినట్లు తెలిసింది. ఉద్యోగాల ఫైలుపై ఎలాంటి కదలికలు లేకపోవడంతో డబ్బులు చెల్లించినవారు రాజమండ్రి బాటపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే పోస్టింగ్ వస్తుందని, సీఎం సైతం సంతకం చేశారని హోంగార్డుల నుంచి ప్రస్తుతం మరో రూ.లక్ష చొప్పున సదరు వ్యక్తులు వసూలు చేసినట్లు తెలిసింది.

 హోంగార్డులూ మోసపోవద్దు..
 ఇలా ఉండగా, పోలీసు శాఖకు చెందిన హోంగార్డులతో రవాణా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసే చట్టం లేదని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రవాణాశాఖ కానిస్టేబుళ్ల భర్తీలో తమకు కోటా కేటాయించాలని గతంలో హోంగార్డుల సంఘం విజ్ఞప్తి చేసిందని, కానీ అది సాధ్యం కాదని అదనపు రవాణా కమిషనర్ పి.శ్రీనివాస్ ‘సాక్షి’తో చెప్పారు. పోటీలో నెగ్గిన వారికే ఉద్యోగాలోస్తాయన్నారు. మరోవైపు హోంగార్డుల విజ్ఞాపనపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కానిస్టేబుళ్ల  భర్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement