ఇక కూనలు కాదు

24 Apr, 2015 01:07 IST|Sakshi
ఇక కూనలు కాదు

పాక్‌పై బంగ్లా క్లీన్‌స్వీప్ అద్భుతం  
 ప్రపంచకప్ ద్వారా పెరిగిన విశ్వాసం

 
 సాక్షి క్రీడావిభాగం
 మనం ఐపీఎల్ సంబరంలో ఉండి సరిగా పట్టించుకోలేదు కానీ... బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై సాధించింది సామాన్యమైన ఘనత కాదు. పాకిస్తాన్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో ఓడించడం చాలా పెద్ద విజయం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సాధికారికంగా గెలిచారు. ఏదో అదృష్టవశాత్తూనో లేక ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనతో కాదు. మొత్తం అందరూ సమష్టిగా రాణించి మూడు ఘన విజయాలు సాధించారు. సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ప్రపంచం ఈ ఫలితాన్ని ఊహించలేదు.
 
 పెరిగిన ఆత్మవిశ్వాసం
 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం, భారత్‌తో అంపైరింగ్ నిర్ణయాలు వ్యతిరేకంగా రాకపోతే సెమీస్‌కు చేరేవాళ్లమనే భావన బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచాయి. దీనికి తోడు స్వదేశం చేరుకున్న తర్వాత జరిగిన సన్మానాలు బంగ్లా క్రికెటర్లకు కొత్త ‘కిక్’ ఇచ్చాయి. దేశం మొత్తం స్టార్స్‌గా ఆరాధించడం మొదలుపెట్టింది. దీంతో పాక్‌తో సిరీస్‌కు కొత్త ఉత్సాహంతో సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల్లోనూ కలిసి టాప్-6 బ్యాట్స్‌మెన్ మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.
 
 గుల్, రియాజ్, అజ్మల్ లాంటి స్టార్స్ ఉన్న బౌలింగ్ లైనప్‌పై ఇంత బాగా ఆడటం అభినందనీయం. ముఖ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో అద్భుతమైన నిలకడ చూపించాడు. ముష్ఫికర్, సౌమ్య సర్కార్ చెరో సెంచరీ చేశారు. ఇక షకీబ్ తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కొనసాగిస్తే... బౌలింగ్‌లో అరాఫత్ సన్నీ, రూబెల్ హొస్సేన్ ఆకట్టుకున్నారు. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బంగ్లా... పాక్‌ను చిత్తు చేసింది.
 
 ఇకపై జాగ్రత్తగా...
 ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త క్రికెటర్లను బీసీసీఐ గనక పంపితే... ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో బంగ్లా మనకూ షాక్ ఇస్తుంది. కాబట్టి ఇకపై భారత్‌తో పాటు ఏ జట్టయినా సరే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే చాలా జాగ్రత్తగా ఆడి తీరాల్సిందే.
 
 పాక్‌లో ఆగ్రహజ్వాలలు
 మరోవైపు పాకిస్తాన్‌లో తమ జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇది దారుణమైన ఓటమి అని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. కోచ్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని మార్చాలని, బోర్డును, సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్ సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్‌ఖాన్ మాత్రం దీనిని తేలికగానే తీసుకున్నారు. ‘సిరీస్ ఓటమి బాధాకరమే అయినా ఈ ఓటమి గురించి అంతగా ఆందోళన అనవసరం. అయితే  జట్టు తిరిగి వచ్చాక మాత్రం దీనిపై విచారణ చేస్తాం’ అని ఖాన్ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు