ఆటగాళ్ల పేర్లను వెల్లడించవద్దు

7 Mar, 2014 01:35 IST|Sakshi

సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ
 న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌తో సంబంధమున్నట్టుగా జస్టిస్ ముద్గల్ కమిటీ పేర్కొన్న నివేదికలోని ఆటగాళ్ల పేర్లను బహిర్గతపర్చవద్దని బీసీసీఐ... సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఈ ఉదంతంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తమ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచి గతంలోనే కోర్టుకు సమర్పించింది.
 
  ఫిక్సింగ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లకు ప్రమేయముందని, వీరిలో ఒకరు ప్రస్తుత జట్టులోనూ ఉన్నాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను ఆధారం చేసుకుని మీడియాలో అనేక ఊహా త్మక, నిరాధార కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఏ తప్పూ చేయని క్రికెటర్లకు నష్టం కలిగించేలా ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అందుకే నివేదికలోని ఆటగాళ్ల పేర్లు బయటికి రాకుండా అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించింది.
 
 ప్యానెల్ సూచనలకు అంగీకారం
 బెట్టింగ్, ఫిక్సింగ్‌లకు తావు లేకుండా క్రికెట్‌ను స్వచ్ఛంగా ఉంచేందుకు జస్టిస్ ముద్గల్ చేసిన ప్రతిపాదనలను బీసీసీఐ అంగీకరించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం జరిగే పార్టీలను నిషేధించడంతో పాటు క్రికెటర్ల ఏజెంట్ల పేర్లను రిజిష్టర్ చేసుకునే విధంగా చూస్తామని తెలిపింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన కంపెనీల్లో ఆటగాళ్లు ఉద్యోగులుగా ఉండరాదనే ముద్గల్ కమిటీ సూచనను బీసీసీఐ తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
 

మరిన్ని వార్తలు