సంతకం చేయని హెచ్‌సీఏ

21 Aug, 2015 02:38 IST|Sakshi

 హెచ్‌సీఏ
 ముంబై: క్రికెట్ రాజకీయాల ప్రక్షాళనలో భాగమంటూ బీసీసీఐ కొత్తగా ప్రతిపాదించిన ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ డిక్లరేషన్‌కు కొన్ని సభ్య సంఘాలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. క్రికెట్ పరిపాలనలో భాగంగా ఉంటూ ఆటకు సంబంధించిన ఇతర లాభసాటి వ్యాపారాలు తాము ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రాల సంఘాలు బీసీసీఐకి డిక్లరేషన్ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజుల క్రితం బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 30 అసోసియేషన్లలో 4 మినహా మిగతా అన్నీ ఈ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి.
 
  హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)తో పాటు తమిళనాడు, కర్ణాటక, హర్యానా సంఘాలు మాత్రం దీనిపై స్పందించలేదు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్ సొంత అకాడమీలు నిర్వహిస్తున్నారని, వాటిలోని ఆటగాళ్లే టీమ్‌లోకి ఎంపికవుతారని బోర్డు మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఇటీవల లోధా కమిటీకి స్వయంగా ఫిర్యాదు చేశారు. ‘కాన్‌ఫ్లిక్స్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేందుకు మార్గదర్శకాలు ఏమిటి. మా అబ్బాయి క్రికెటర్ కావడాన్ని లేదా కమిటీలో సభ్యుడు కావడాన్ని మీరు ఎలా అడ్డుకుంటారు.
 
  క్రికెట్‌తోనే సంబంధాలు ఉన్నవాళ్లం మరో పని ఏం చేస్తాం. లోధా కమిటీ వచ్చి తనిఖీ చేయనివ్వండి’ అని హెచ్‌సీఏ సభ్యుడొకరు గట్టిగా స్పందించారు. ఈ నెల 30న బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. తమకు దీనిపై చాలా సందేహాలున్నాయని, అప్పటి వరకు ఎలాంటి సంతకం చేయబోమని తమిళనాడు, కర్ణాటక సంఘాలు స్పష్టంగా చెప్పేశాయి. బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరికి చెందిన హర్యానా సంఘం కూడా దీనిపై సంతకం చేయకపోవడం విశేషం.
 

మరిన్ని వార్తలు