ఆస్ట్రేలియా 287/3 | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా 287/3

Published Fri, Aug 21 2015 12:02 AM

ఆస్ట్రేలియా 287/3

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (132 బంతుల్లో 78 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆడమ్ వోజెస్ (47 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 101 పరుగులు జోడించారు. అంతకు ముందు డేవిడ్ వార్నర్ (131 బంతుల్లో 85; 11 ఫోర్లు), క్రిస్ రోజర్స్ (43) తొలి వికెట్‌కు 110 పరుగులతో పటిష్ట పునాది వేశారు. చివరి టెస్టు ఆడుతున్న  క్లార్క్ (15) విఫలమయ్యాడు.  
 
 హ్యూస్‌ను స్మరించుకున్న క్లార్క్: ఓవల్ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న క్లార్క్‌కు మైదానంలో ఘనస్వాగతం లభించింది. అతను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో అభినందలు తెలిపారు. గత ఏడాది మరణించిన తన మిత్రుడు ఫిల్ హ్యూస్‌ను మరోసారి గుర్తు చేసుకుంటూ క్లార్క్ భుజానికి ‘పీహెచ్’ అని రాసి ఉన్న నల్ల బ్యాండ్‌ను కట్టుకొని బరిలోకి దిగాడు. హ్యూస్ జెర్సీ నంబర్ గుర్తుకు తెచ్చేలా స్థానిక కాలమానం ప్రకారం క్లార్క్ సరిగ్గా 4.08 గంటలకు అవుట్ కావడం విశేషం! క్లార్క్ తనకు తెలీకుండానే ఇచ్చిన నివాళి అంటూ సోషల్ మీడియాలో దీనిపై సందేశాలు వెల్లువెత్తాయి.

Advertisement
Advertisement