కరువు సీమలో మరో టెండూల్కర్‌

31 Jul, 2019 09:02 IST|Sakshi

ఆ కుటుంబానికి క్రికెట్‌ అంటే ప్రాణం

సచిన్‌ అంటే వల్లమాలిన ప్రేమ

కుమారుడికి సచిన్‌ కుమారుడి పేరు 

అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తున్న వైనం

సాక్షి, కడప స్పోర్ట్స్‌ : సాధారణ చేనేత కుటుంబానికి చెందిన అర్జున్‌ టెండూల్కర్‌ క్రికెట్‌లో యువకెరటంలా దూసుకువస్తున్నాడు.. కడపలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీల్లో అనంత జట్టు తరపున 252 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి త్రిశతకం చేసే దిశగా ముందుకు సాగుతున్న అర్జున్‌ టెండూల్కర్‌ వివరాలివి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని గోట్లూరు గ్రామానికి చెందిన పిట్టా ఆదినారాయణ, పార్వతి (చేనేత కార్మికులు) దంపతులకు నలుగురు సంతానం. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె లీలావతి గృహిణి కాగా, రెండో కూతురు పల్లవి మహిళా క్రికెటర్, పెద్ద కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ అండర్‌–16 విభాగం క్రికెటర్‌.

చిన్న కుమారుడు మణిదీప్‌ అండర్‌–14 క్రికెటర్‌గా రాణిస్తుండటం విశేషం. ఆ క్రికెట్‌ కుటుంబానికి సచిన్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో పెద్ద కుమారుడికి అర్జున్‌ టెండూల్కర్‌(సచిన్‌ కుమారుడు) పేరు పెటారు. 3వ తరగతి నుంచి క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన అర్జున్‌ అనతికాలంలోనే క్రికెట్‌టో రాణించడం ప్రారంభించాడు. 6వ తరగతిలో కడపలోని సౌత్‌జోన్‌ అకాడమీకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం అనంతపురంలోని రాధాకృష్ణ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఈ యువ కెరటం దేశానికి ప్రాతినిథ్యం వహించడమే ధ్యేయంగా ముందు కు సాగుతున్నాడు. అండర్‌–12, అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19 విభాగాల్లో ఇప్పటి వరకు  జిల్లా నుంచి 12 సార్లు ప్రాతినిథ్యం వహించాడు.

గత సీజన్‌లో అండర్‌–16 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌లో 600 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, 1 సెంచరీతో రాణించాడు. నాలుగు సంవత్సరాలుగా అండర్‌–14 విభాగంలోను, గతేడాది నుంచి అండర్‌–16 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ రాణిస్తున్నాడు.  ప్రస్తుతం కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్‌ జిల్లాల అండర్‌–16 క్రికెట్‌ పోటీల్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అర్జున్‌ టెండూల్కర్‌ తొలి మ్యాచ్‌లో 82 పరుగులు, రెండో మ్యాచ్‌లో 49 పరుగులు చేయగా, మూడో(ప్రస్తుతం) మ్యాచ్‌లో 252 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సచిన్, రోహిత్‌ శర్మల ఆటతీరంటే ఇష్టమని.. ఇండియా జెర్సీని ధరించి దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నదే  లక్ష్యమని యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ చెప్పాడు. శిక్షకులు యుగంధర్, తాహీర్, రంజీ క్రికెటర్‌ షాబుద్దీన్‌ సూచనలు, సలహాలు క్రికెట్‌లో రాణిం చేందుకు దోహదం చేస్తున్నాయంటున్నాడు. 

మరిన్ని వార్తలు