లారాను భయపెట్టిన ఇన్నింగ్స్ అది: గేల్

12 Jun, 2016 17:10 IST|Sakshi
లారాను భయపెట్టిన ఇన్నింగ్స్ అది: గేల్

న్యూఢిల్లీ: క్రిస్ గేల్..విధ్వంసకర ఆట తీరుకు మారుపేరు. దాంతో పాటు వివాదాలు ఆ క్రికెటర్కు కొత్తమే కాదు. ఇటీవల వరుస రెండు సంఘటనల్లో మహిళా జర్నలిస్టుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదాలకు తెరలేపాడు. అయితే  'సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పేరుతో తన జీవిత కథను పుస్తక రూపంలోకి తెచ్చిన గేల్.. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాకు సంబంధించి కొన్నిఆసక్తికర విషయాలను వెల్లడించాడు.  2005లో తాను దక్షిణాఫ్రికాపై  చేసిన  ట్రిపుల్ సెంచరీ(317)తో చెలరేగడం చూసి లారా ఒకింత భయపడ్డాడని  ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.  దీనికి కారణం అంతకుముందు సంవత్సరం ఇంగ్లండ్పై లారా నమోదు చేసిన 400 పరుగులే కారణమని గేల్ పేర్కొన్నాడు. 


'నేను దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ చేసిన మ్యాచ్లో లారా కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్లో లారా నాలుగు పరుగులకే పెవిలియన్ కు చేరి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నాడు. నేను ఆడుతుంటే పదే పదే బాల్కనీలోకి వెళుతూ స్కోరు బోర్డును చూస్తునే ఉన్నాడు.  అతని రికార్డును నేను బద్దలు కొడతాననే ఆందోళన లారాలో కనిపించింది.  స్కోరు బోర్డును చూడటం, ఎక్కువగా నిరాశ చెందడం స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత లంచ్, టీ బ్రేక్ల్లో కూడా లారా నుంచి నాకు ఎటువంటి సలహా రాలేదు.  కనీసం సీనియర్ ఆటగాడిగా లారా నుంచి కొన్ని సూచనలు వస్తాయని ఆశించినా అతను మాత్రం మౌనంగానే ఉన్నాడు' అని గేల్ తన జీవిత కథలో పేర్కొన్నాడు. 2010లో శ్రీలంకపై మరో ట్రిపుల్ సెంచరీని గేల్ నమోదు చేసినా, లారా రికార్డును మాత్రం అధిగమించలేకపోయాడు.

మరిన్ని వార్తలు