రికార్డుకు వికెట్‌ దూరంలో బుమ్రా..

9 Jan, 2020 15:03 IST|Sakshi

పుణె: గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుని ఇటీవలే భారత క్రికెట్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీసిన బుమ్రా తన మార్కు బౌలింగ్‌ వేయడంలో కూడా విఫలమయ్యాడు. ప్రధానంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న బుమ్రా.. ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు సమర్పించుకున్నాడు. శ్రీలంక ఆటగాడు హసరంగా హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టడమే బుమ్రా పేస్‌ బౌలింగ్‌లో వేడి తగ్గిందనడానికి ఉదాహరణ. తన బౌలింగ్‌పై పెద్దగా సంతృప్తిగా లేని బుమ్రా.. చివరి టీ20లో రాణించాలని చూస్తున్నాడు.

శుక్రవారం భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరుగనుంది. ఇక్కడ బుమ్రాను ఒక రికార్డు ఊరిస్తోంది. భారత్‌ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఘనతను సాధించడానికి బుమ్రా వికెట్‌  దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అశ్విన్‌-చహల్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రా.. వ్యక్తిగత అత్యధిక వికెట్లు సాధించడానికి వికెట్‌ కావాలి. అశ్విన్‌-చహల్‌-బుమ్రాలు 52 టీ20 వికెట్లతో టాప్‌లో ఉన్నారు.

రేపటి మ్యాచ్‌లో చహల్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల మార్కును బుమ్రా అందుకునే చాన్స్‌ ఉంది. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో పాటు గత మ్యాచ్‌లో కుల్దీప్‌ రాణించడంతో అతనికే తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. దాంతో చహల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.  బుమ్రా 44 టీ20 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు సాధించగా, చహల్‌ 36 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించాడు. అశ్విన్‌ 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు సాధించాడు.

మరిన్ని వార్తలు