ఇక ముంబైపై గెలిస్తేనే..!

24 May, 2014 06:59 IST|Sakshi
ఇక ముంబైపై గెలిస్తేనే..!

చావోరేవో స్థితికి చేరిన రాజస్థాన్
 కీలక మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి
 రాణించిన మార్ష్, మిల్లర్   
 బెయిలీ సేనకే అగ్రస్థానం
 
 ఐపీఎల్ అంటేనే అనూహ్య ఫలితాలకు, సంచలనాలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుతామనే ధీమాతో ఉన్న రాజస్థాన్... ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితికి చేరింది. పంజాబ్ చేతిలో ఓటమితో... ఇక చివరి మ్యాచ్‌లో ముంబైపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా... ఆఖరి లీగ్ మ్యాచ్ (ఆదివారం) ద్వారానే ప్లే ఆఫ్ తుది బెర్త్ ఖరారు కానుంది.
 
 మొహాలీ: ఐపీఎల్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ చివర్లో మాత్రం తడబడుతోంది. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇక నాకౌట్‌కు చేరుకోవాలంటే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే ముంబైతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వాట్సన్ సేనకు కాస్త ఊరటనిచ్చే అంశం.
 
  మరోవైపు ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన పంజాబ్ 16 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. మార్ష్ (35 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), సాహా (20 బంతుల్లో 27; 4 ఫోర్లు), బెయిలీ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వోహ్రా (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు.  
 
  బెయిలీ, మిల్లర్ ఐదో వికెట్‌కు 32 బంతుల్లో అజేయంగా 60 పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), హాడ్జ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), రహానే (26 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్ మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు.
 
 స్కోరు వివరాలు
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) మాలిక్ (బి) ఫాల్క్‌నర్ 18; వోహ్రా రనౌట్ 25; మార్ష్ (సి) రహానే (బి) మాలిక్ 40; సాహా (సి) రహానే (బి) తెవాటియా 27; మిల్లర్ నాటౌట్ 29; బెయిలీ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179.
 వికెట్ల పతనం: 1-24; 2-54; 3-113; 4-119.
 
 బౌలింగ్: విక్రమ్‌జీత్ మాలిక్ 3-0-29-1; వాట్సన్ 2-0-16-0; ఫాల్క్‌నర్ 3-0-39-1; కూపర్ 4-0-25-0; తెవాటియా 4-0-24-1; ప్రవీణ్ తాంబే 4-0-36-0.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) ధావన్ 23; నాయర్ (సి) బెయిలీ (బి) బాలాజీ 11; శామ్సన్ (స్టంప్డ్) సాహా (బి) కరణ్‌వీర్ 30; వాట్సన్ (బి) ధావన్ 0; బిన్ని (సి) మార్ష్ (బి) కరణ్‌వీర్ 7; తెవాటియా (సి) కరణ్‌వీర్ (బి) అక్షర్ పటేల్ 16; హాడ్జ్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ పటేల్ 31; ఫాల్క్‌నర్ నాటౌట్ 35; కూపర్ (సి) మార్ష్ (బి) అక్షర్ పటేల్ 2; మాలిక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163.
 
 వికెట్ల పతనం: 1-21; 2-56; 3-56; 4-70; 5-83; 6-101; 7-128; 8-130.
 బౌలింగ్: బాలాజీ 4-0-37-1; హెండ్రిక్స్ 4-0-57-0; రిషీ ధావన్ 4-0-25-2; అక్షర్ పటేల్ 4-0-24-3; కరణ్‌వీర్ సింగ్ 4-0-16-2.
 

మరిన్ని వార్తలు