నాశనం చేసింది గ్రెగ్ చాపెల్ కాదు..

27 Apr, 2017 17:53 IST|Sakshi
నాశనం చేసింది గ్రెగ్ చాపెల్ కాదు..

బరోడా:ఇర్ఫాన్ పఠాన్.. భారత క్రికెట్ జట్టులో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్. ఇప్పటివరకూ భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఆల్ రౌండర్లను లెక్కిస్తే అందులో ఇర్ఫాన్ కచ్చితంగా ముందువరుసలోనే ఉంటాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్న క్రికెటర్ ఇర్ఫాన్. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టులో ఇర్ఫాన్ కీలక సభ్యుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ఒక్కసారిగా అథమస్థాయి పడిపోవడం, ఆ తరువాత అతనికి అవకాశాలు కనుచూపుమేరలో లేకపోవడం జరిగిపోయాయి.  అయితే ఇర్ఫాన్ కెరీర్ నాశనం కావడానికి ఒకనాటి భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ అనే అపవాదు కూడా ఉంది. ఇర్ఫాన్ ను ఇష్టానుసారం ఉపయోగించుకుని అతని కెరీర్ ను చాపెల్ నాశనం చేశాడంటూ అప్పట్లో రూమర్లు కూడా వెలుగుచూశాయి.

దాన్ని తాజాగా ఖండించాడు ఇర్ఫాన్. ' నా కెరీర్ ఒక్కసారిగా నాశనం కావడం ఊహించింది కాదు. అది అలా జరిగిపోయింది. నా కెరీర్ నాశనం కావడానికి గ్రెగ్ చాపెల్ అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. ఏ ఒక్కరు ప్రమేయంతో మన కెరీర్ నాశనం కాదు. . నీ జీవితంలో ఏమి జరిగినా దానికి నీవే బాధ్యుడివి. అంతేకానీ వేరే వారు ఎప్పుడు కారణం కాదు. మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది సక్రమంగా చేయడమే మన కర్తవ్యం. అలాగే నా కెరీర్ పతనం విషయంలో కూడా చాపెల్ కారణం కాదు. నేను ఎప్పుడైతే జట్టులో స్థానం కోల్పోయానో, అప్పుడు గాయాలు కూడా బాధించాయి. దాంతో తిరిగి జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమైంది. నా కెరీర్ నాశనం కావడానికి కారణం గాయాలే'అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్‌ లయన్స్‌ తరపున ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో దూరం కావడంతో అతని స్థానంలో ఇర్ఫాన్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 సీజన్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించినా ఎవరూ కొనుగోలు చేయలేదు.

మరిన్ని వార్తలు