విజేత చెన్నై లయోలా

13 Feb, 2014 00:15 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్ : ఫాదర్ బాలయ్య స్మారక క్రీడల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్  టోర్నమెంట్‌లో చెన్నై లయోలా జట్టు విజేతగా నిలిచింది. లయోలా కాలేజిలో బుధవారం జరిగిన ఫైనల్లో చెన్నై లయోలా 80-65తో లయోలా అకాడమీ (హైదరాబాద్)పై గెలిచింది. ఆట ప్రారంభంలో చెన్నై లయోలా కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు గణేశ్, ఉదయ్, డేవిడ్ ప్రతిఘటించారు. అయినా మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 35-32తో చెన్నై లయోలా ముందంజలో నిలిచింది.
 
 అనంతరం విజృంభించిన చెన్నై లయోలా ఆటగాళ్లు కార్తికేయన్ (23), ఆంటో (23) చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును ముందంజలో ఉంచేందుకు దోహదపడ్డారు. చివరి వరకు లయోలా అకాడమీ క్రీడాకారులు జోస్ (15), చంద్రహాస్ (14) ఎదుర్కునేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో లయోలా అకాడమీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో ఏవీ కాలేజి 56-45తో సెయింట్ మార్టిన్స్‌పై గెలుపొందింది.
 
 సాక్రెడ్ హార్ట్‌కు వాలీబాల్ టైటిల్
 వాలీబాల్ ఫైనల్లో సాక్రెడ్ హార్ట్ (తిరుపత్తూర్) జట్టు 25-22, 25-21, 21-25, 25-20తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో జమాల్ మహ్మద్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ సాక్రెడ్ హార్ట్ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడో సెట్‌లో జమాల్ మహ్మద్ ఆటగాళ్లు సాక్రెడ్ హార్ట్ జట్టును కంగుతినిపించారు.
 

 అనంతరం నాలుగో సెట్‌లో తేరుకున్న సాక్రెడ్ హార్ట్ చాకచక్యంగా వ్యవహరించి టైటిల్‌ను దక్కించుకుంది. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో లయోలా అకాడమీ 24-25, 18-25, 19-25, 25-15, 15-10తో ఆంధ్రా లయోలా కాలేజిపై గెలిచింది. విజేతలకు గ్రేట్ స్పోర్ట్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు