శ్రీజ తడాఖా

22 Jul, 2019 06:34 IST|Sakshi

కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు ఖాయం

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సత్యన్‌–అర్చన జంటకు స్వర్ణం

కటక్‌: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో సెమీఫైనల్‌ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్‌ హోదాలో మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్‌)పై అద్భుత విజయం సాధించింది.

అంతకుముందు శ్రీజ తొలి రౌండ్‌లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్‌)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్‌ (భారత్‌)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్‌ (భారత్‌) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్‌ వాన్‌ లింగ్‌–తాన్‌ లిలిన్‌ జాసీ (సింగపూర్‌) జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్‌ యు ఎన్‌ కొయెన్‌–గోయ్‌ రుయ్‌ జువాన్‌ (సింగపూర్‌) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది  

మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కే చెందిన సత్యన్‌ జ్ఞానశేఖరన్‌–అర్చన కామత్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్‌–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్‌ యు ఎన్‌ కొయెన్‌–గోయ్‌ రుయ్‌ జువాన్‌ (సింగపూర్‌) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, హర్మీత్‌ దేశాయ్‌ (భారత్‌) సెమీఫైనల్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు