క్యాచ్‌ మిస్‌.. వరల్డ్‌కప్‌ గోవిందా..!

9 May, 2019 20:53 IST|Sakshi

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సాధించాలన్న దక్షిణాఫ్రికా కల నేటికి కలగానే మిగిలిపోయింది. నిర్ణయాక మ్యాచుల్లో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటు. అయితే, 1999 వరల్డ్‌కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో నిలిచిన ఆ జట్టును ఓ మిస్‌ఫీల్డ్‌ కొంపముంచింది. చెత్త ఫీల్డింగ్‌తో హర్షలే గిబ్స్‌ తన జట్టుకు తీరని వ్యథ మిగిల్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను జారవిడిచి అటు మ్యాచ్‌ను, ఇటు ప్రపంచప్‌ గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని దూరం చేశాడు. ఒకవేళ ‘అత్యంత చెత్త క్యాచ్‌ మిస్‌’ అవార్డు ఏదైనా ఉంటే అది.. గిబ్స్‌కే ఇవ్వాల్సి ఉంటుందని నాటి చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాళ్లు.

మ్యాచ్‌ పోయింది.. కప్పు పోయింది..
1999 ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అంచనాలకు తగినట్లే ఆడింది. సూపర్‌ సిక్స్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా పేస్‌ దళం అలెన్‌ డోనాల్డ్‌, షాన్‌ పొలాక్‌, స్టీవ్‌ ఎల్వర్థి, లాన్స్‌ క్లుజెనర్ ఆసీస్‌కు చెమటలు పట్టించారు. 12 ఓవర్లలో 48 పరుగులు చేసిన ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. క్రీజులో పాంటింగ్‌, స్టీవ్‌ వా ఆచితూచి ఆడుతున్నారు. ఒక్కో పరుగు జోడిస్తూ తమ జట్టుని విజయం వైపు తీసుకెళ్తున్నారు. 

ధాటిగా ఆడుతున్న స్టీవ్‌వా ప్రమాదకరంగా మారాడు. ఆసీస్‌ స్కోరు 30 ఓవర్లలో మూడు వికెట్లకు 149. ఈ జోడీని విడగొడితే దక్షిణాఫ్రికా గెలుపునకు దగ్గరైనట్లే. అయితే, మరుసటి ఓవర్లోనే ఆ జట్టుకు భారీ షాక్‌. 31 ఓవర్‌ చివరి బంతికి స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హర్షలే గిబ్స్‌ జారవిడిచాడు. క్యాచ్‌ పట్టిన ఆనందంలో బంతిని పైకి ఎగరేద్దామనుకున్నాడు. పూర్తిగా ఒడిసిపట్టక మునుపే బంతిని గాల్లోకి ఎగరేసేందుకు యత్నించాడు. ఆ క్రమంలో బంతి చేజారింది. క్యాచ్‌ మిస్‌. మ్యాచ్‌ గోవిందా..!

దొరికిన అవకాశాన్ని వినియోగించుకున్న స్టీవ్‌వా మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండు బంతులు మిగిలుండగానే 5వికెట్లు కోల్పోయి ఆసీస్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో మరోసారి తలపడిన దక్షిణాఫ్రికా మళ్లీ పరాజయం పాలైంది. సూపర్‌సిక్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌ మరోసారి దెబ్బకొట్టింది. టైగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది. ఫైనల్‌ చేరి పాకిస్తాన్‌ను సునాయాసంగా ఓడించి రెండోసారి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. సూపర్‌సిక్స్‌లో గెలవకపోయుంటే ఆసీస్‌ ఇంటిదారిపట్టేది. మిగతా జట్లతో పోల్చుకుంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా కప్పును ముద్దాడేది. ఇక దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు