'షహెన్ షా' రుడిషా...

17 Aug, 2016 01:10 IST|Sakshi
'షహెన్ షా' రుడిషా...

వరుసగా రెండోసారి 800 మీటర్ల స్వర్ణం నెగ్గిన కెన్యా స్టార్
1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా గుర్తింపు


రియో డి జనీరో: కొంతకాలంగా గాయాలతో సతమతమైనప్పటికీ... కెన్యా స్టార్ అథ్లెట్ డేవిడ్ రుడిషా రియో ఒలింపిక్స్‌లో మాత్రం మెరిపించాడు. తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించి పురుషుల 800 మీటర్ల విభాగంలో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం జరిగిన ఫైనల్ రేసులో రుడిషా ఒక నిమిషం 42.15 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 1964లో పీటర్ స్నెల్ (న్యూజిలాండ్) తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 800 మీటర్ల విభాగంలో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా రుడిషా గుర్తింపు పొందాడు.


లండన్ ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణాన్ని కైవసం చేసుకున్న రుడిషా ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయాడు. దేశవాళీ ఒలింపిక్ ట్రయల్స్‌లో మూడో స్థానాన్ని పొందినా... అసలైన రియో ఈవెంట్‌లో మాత్రం తనలోని చాంపియన్ రన్నర్‌ను ఆవిష్కరించాడు. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లిన రుడిషా చివరి 300 మీటర్లలో మరింత వేగాన్ని పెంచి సులువుగా విజయాన్ని సాధించాడు. తౌఫీఖ్ మఖ్లూఫి (అల్జీరియా-1ని:42.61 సెకన్లు) రజతం... క్లేటన్ మర్ఫీ (అమెరికా-1ని:42.93 సెకన్లు) కాంస్యం సాధించారు. 1992 తర్వాత 800 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. ‘చాలా ఉత్కంఠగా ఉంది. నా జీవితంలోనే గొప్ప క్షణాలివి. కొంతకాలంగా గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఏకాగ్రతతో లక్ష్యసాధన కోసం కృషి చేశాను’ అని రుడిషా వ్యాఖ్యానించాడు.
 

మిస్టర్ పర్‌ఫెక్ట్
ఉసేన్ బోల్ట్‌కు సరితూగగల అథ్లెట్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా..? ఒక్కడున్నాడు.
మైకేల్ జాన్సన్‌లా వరుసగా మూడుసార్లు అవార్డులు గెలిచిన వాళ్లున్నారా..? ఒక్కడున్నాడు.
ఆ దేశంలో అంతా డోపింగ్ చేస్తారు... ఎవరైనా క్లీన్‌గా ఉన్నారా..? ఒక్కడున్నాడు.
అన్నిచోట్లా ఆ ఒక్కడు రుడిషా. తాను తప్పు చేయడు... పైగా ఎవరైనా తప్పు చేసే వాళ్లు కనిపించినా సహించడు. అందుకే అథ్లెటిక్స్ ప్రపంచంలో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు ఈ కెన్యా స్టార్.


2012 లండన్ ఒలింపిక్స్... 800 మీటర్ల పరుగు మొదలైంది. మహామహుల్లాంటి స్ప్రింటర్లు రేసులో పరిగెడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా కెన్యా అథ్లెట్ రుడిషా తొలి 200 మీటర్లు అందరికంటే ముందున్నాడు. కానీ మిగిలినవాళ్లు తమ అనుభవంతో ముందుకు దూసుకొచ్చారు. ఇక 100 మీటర్లే మిగిలుంది. అప్పుడు జరిగిందో అద్భుతం. రుడిషా చిరుత పులిని తలపిస్తూ వేగం పెంచాడు. అందరినీ వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు. అదీ మామూలుగా కాదు... 1.40.91 నిమిషాల్లో రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈసారి రియోలోనూ అంతే. తొలి 500 మీటర్లు వెనకబడ్డాడు. కానీ చివరి 300 మీటర్లలో వేగంతో ప్రత్యర్థికి అందనంత ముందు రేసు పూర్తి చేశాడు. 100 మీటర్ల రేసులో బోల్ట్‌ను అందుకోవడం ఎంత కష్టమో... 800 మీటర్లలో రుడిషాను ఆపడమూ అంతే కష్టం. కెరీర్‌లో ఏడుసార్లు ఈ పరుగును 1.42 నిమిషాల్లో పూర్తి చేసిన ఒకే ఒక్క అథ్లెట్ ఈ కెన్యా స్టార్. ‘ప్రపంచ ఉత్తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్’ అవార్డును వరుసగా మూడేళ్లు గెలుచుకున్న మైకేల్ జాన్సన్ ఘనతను ఈ తరంలో అందుకుంది ఒక్క రుడిషానే.

 
‘ఉడ్తా కెన్యా’పై పోరాటం

క్రీడా ప్రపంచానికి డోపింగ్ ఓ శాపంగా మారింది. న్యూట్రిషన్ల పేరుతో సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ (పీఈడీలు)ను తెలియకుండానే తీసుకుని చాలా మంది అథ్లెట్లు కెరీర్‌ను మధ్యలోనే ముగించుకుంటున్నారు. కొందరు యువ అథ్లెట్లు కావాలనే స్టెరాయిడ్లు తీసుకుంటున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకునే క్రీడాకారులంటే రుడిషాకు నచ్చదు. చాలా సార్లు బహిరంగంగానే వారిపై అసహనం వ్యక్తం చేశాడు. డోపింగ్ ఆరోపణల కారణంగా రియో ఒలింపిక్స్‌కు ముందు మొత్తం కెన్యా అథ్లెట్లపైనే నిషేధం పడుతుందనిపించింది. దీనిపై రుడిషా తీవ్రంగా స్పందించాడు. ‘ఇటీవలి కాలంలో కెన్యాలో జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరం. చాలా ఏళ్లుగా అథ్లెటిక్స్‌లో కెన్యాకు మంచి రికార్డుంది. డ్రగ్స్ అవసరం లేకుండానే ఎన్నో పతకాలు సాధించాం. కానీ కొన్నేళ్లుగా కొందరు యువ అథ్లెట్లు తక్కువ సమయంలోనే పేరు, డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. దీని మాయలో పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారని ఆ ఫూల్స్‌కు అర్థం కావటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మంది తెలియకుండానే బలవర్థకాల పేరుతో డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నాడు.

గాయాలు వేధించినా...
అథ్లెట్ల జీవితంలో గాయాలు సహజం. రుడిషాకూ ఈ సమస్య తప్పలేదు. అయితే గాయం తీవ్రమైనా సహజమైన ఆహారం ద్వారానే శక్తి పొందేందుకు ప్రయత్నించాడు తప్ప... ఒక్క స్పోర్ట్స్ సప్లిమెంటు కూడా తీసుకోలేదు. కెరీర్ మొదట్నుంచీ ఇదే విధానాన్ని అలవర్చుకున్న రుడిషా.. తోటి కెన్యన్లకే కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమే. అందుకే ఇటీవలి కాలంలో కెన్యా అథ్లెట్లపై ఎన్ని డోపింగ్ ఆరోపణలొస్తున్నా.. రుడిషాకు మాత్రం ‘మిస్టర్ క్లీన్’ అనే పేరుంది. అయితే భార్యను వేధిస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. దీంతో రుడిషా కాస్త ఇబ్బంది పడ్డాడు.  కానీ ఆయన భార్యే తెరపైకి వచ్చి ‘మా ఆయన బంగారం’ అని చెప్పి పుకార్లకు ముగింపు పలికింది. రుడిషా తండ్రి డేనియల్ రుడిషా (1968 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన అథ్లెట్), తల్లి నవోమీ (400 మీటర్ల హర్డ్‌లర్) కూడా అథ్లెట్లే.

 
సాధారణ ఆహారం

చాలామంది ఇతర క్రీడాకారులతో పోలిస్తే రుడిషా సాధారణ ఆహారం తీసుకుంటాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, వేయించిన గుడ్డు, టీ మాత్రం తీసుకుంటాడు.  భోజనం కూడా మామూలుగానే ఉంటుంది. లెక్కలు, కేలరీల కొలతలు ఏమీ ఉండవు.

 -సాక్షి క్రీడావిభాగం

 

మరిన్ని వార్తలు