నేనేం తప్పుచేశాను: అంపైర్‌తో వార్నర్‌ వాగ్వాదం

6 Jan, 2020 11:12 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ లెగ్‌ బై రూపంలో పరుగు తీస్తే దాన్ని డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు అంపైర్‌. అసలు స్మిత్‌ కనీసం బంతిని ఆడటానికి యత్నించని కారణంగా దాన్ని డెడ్‌ బాల్‌గా ప్రకటించడంతో లెగ్‌ బై రూపంలో వచ్చినర పరుగు కౌంట్‌ కాలేదు. దాంతో ఫీల్డ్‌ అంపైర్లతో స్మిత్‌ వాగ్వాదానికి దిగాడు. తాజాగా సిడ్నీలో కివీస్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో కూడా ఆసీస్‌కు ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.

ఇక్కడ ఆసీస్‌ చేసిన పరుగుల్లోంచి ఐదు పరుగుల పెనాల్టీ పడింది.  సోమవారం నాల్గో రోజు ఆటలో భాగంగా డేవిడ్‌ వార్నర్‌ పరుగు తీసే క్రమంలో డేంజర్‌ జోన్‌లో పరుగు పెట్టడంతో దానికి ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దాంతో అంపైర్‌ను వార్నర్‌ ప్రశ్నించాడు. అయితే అంపైర్‌ కాస్త ఘాటుగానే తిరస్కరించడంతో వార్నర్‌ మరొక అంపైర్‌ ఎరాస్‌మస్‌ వద్దకు వెళ్లి నిలదీశాడు. తాను ఏం తప్పు చేశానో చెప్పాలంటూ వాదించాడు. తాను షాట్‌ ఆడి జంప్‌ చేశానని, ఏం చేయాలో అంపైర్లు చెప్పాలి కదా అంటూ వాగ్వాదం చేశాడు. దీనిపై అంపైర్లు వెనక్కి తగ్గకపోవడంతో ఆసీస్‌కు ఐదు పరుగుల పెనాల్టీ తప్పలేదు. దాంతో ఆసీస్‌ చేసిన స్కోరులో ఐదు పరుగులు తగ్గించబడ్డాయి.

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ (111 నాటౌట్‌) సెంచరీ సాధించగా, లబూషేన్‌(59) హాఫ్‌ సెంచరీ చేశాడు. జో బర్న్స్‌(40) రాణించడంతో ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 217/2 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఆసీస్‌కు ఓవరాల్‌గా 420 పరుగుల ఆధిక్యం లభిస్తే, పెనాల్టీ కారణంగా వారు సాధించిన ఆధిక్యం 415 పరుగులే అయ్యింది.  దాంతో కివీస్‌ 416 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగింది. కాగా, కివీస్‌ వంద పరుగులు దాటకుండానే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మరిన్ని వార్తలు